హైదరాబాద్‌ మెట్రో సరికొత్త రికార్డు

29 Nov, 2019 10:15 IST|Sakshi

హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో ప్రారంభం

ఐటీ ఉద్యోగులకు ఊరట

ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ :  మెట్రో రైలు మరో మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్‌ మహానగర కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన మెట్రో రైలు మరో కొత్త మార్గంలో  పరుగులు  పెట్టింది. ఒకటిన్నర కిలోమీటర్ల   హైటెక్‌సిటీ– రాయదుర్గం మెట్రో కారిడార్‌లో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఉదయం హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలును ప్రారంభించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సైతం ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.  అక్కడి నుంచి మెట్రో రైల్‌లో మైండ్‌ స్పేస్‌ ముందున్న రాయదుర్గం స్టేషన్‌ వరకు ప్రయాణం చేస్తారు. ఆ తరువాత రోడ్డు మార్గంలో నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు వెళ్లి అక్కడ బుల్‌ స్టాట్యూ ప్రారంభిస్తారు. మెట్రో రైల్‌ ఎం.డి.ఎన్‌వీఎస్‌ రెడ్డి, రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ ఎస్‌.కె.జొషీ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ స్పెషల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఐటీ ఉద్యోగులకు వెసులుబాటు 
హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో మైండ్‌ స్పేస్‌ వరకు మెట్రో రైల్‌ రాకతో ఐటీ ఉద్యోగులకు ఎంతో సౌకర్యం లభించనుంది.  హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాలంటే అరగంటకు పైగా సమయం ట్రాఫిక్‌లోనే గడిచిపోతుంది. దీంతో ఐటీ ఉద్యోగులు నడుచుకుంటూనే  కె.రహేజ, ఫేజ్‌–2లో ఉన్న కంపెనీలకు వెళ్తారు. మెట్రో రాక వల్ల రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో దిగి రహేజతో పాటు, ఫేజ్‌–2 కంపెనీలు, ఇనార్బిట్‌ మాల్‌ రోడ్డులో ఉన్న ఐటీ కంపెనీలకు కాలినడకన వెళ్లవచ్చు. ప్రస్తుతం రెండు మార్గాల్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

నాగోల్‌ నుంచి  అమీర్‌పేట్‌ వరకు అక్కడి నుంచి హైటెక్‌సిటీ వరకు , ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో పరుగులు తీస్తోంది.ప్రతి రోజు సుమారు 4 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. శుక్రవారం హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు  మెట్రో అందుబాటులోకి రావడం వల్ల మరో లక్ష మందికి అదనపు ప్రయోజనం లభించనుంది. ప్రస్తుతం ట్రయల్‌రన్స్‌ కొనసాగుతున్న జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గంలో  సైతం మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రావడం వల్ల లక్ష మందికి పైగా రవాణా సదుపాయం లభిస్తుంది. 


మైండ్‌స్పేస్‌ ముందు రాయదుర్గం మెట్రో స్టేషన్‌ 

రెండేళ్లలో 12.5 కోట్ల మంది ప్రయాణికులు
ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా పేరొందిన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టిన  ప్రాజెక్టు. రెండేళ్ల క్రితం  నగరంలో  మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12.5 కోట్ల మంది ప్రయాణికులు  మెట్రో సేవలను వినియోగించుకున్నారు. ప్రస్తుతం రోజుకు 4 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండేళ్లలో మెట్రో రైళ్లు 86 లక్షల కిలోమీటర్లు తిరిగినట్లు  హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ   ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు