ప్రతి నీటి చుక్కనూ ఒడిసిపట్టాలి

29 Feb, 2020 02:52 IST|Sakshi
శుక్రవారం ‘జలమండలి’ థీమ్‌ పార్కులో టాకింగ్‌ ట్రీ వద్ద మంత్రి కేటీఆర్, తదితరులు

వాన నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి: మంత్రి కేటీఆర్‌

వాక్‌ కార్యక్రమం భేష్‌ 

‘జలమండలి’ థీమ్‌ పార్కును సందర్శించిన మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి నీటి బొట్టు అమూల్యమైందని, దాన్ని ఒడిసి పట్టాలని రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని, దీనికి ప్రజలంతా కలసి రావాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి సంరక్షణపై ఈ వేసవిలోనే కార్యక్రమాలు చేపట్టాలని, ఇది రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలు ఇస్తుందని మంత్రి సూచించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో జలమండలి నిర్మించిన థీమ్‌ పార్కును సందర్శించిన మంత్రి, అక్కడే జలమండలి చేపట్టిన ప్రాజెక్టులపై, బోర్డు కార్యకాలాపాలపై సమీక్ష జరిపారు. థీమ్‌ పార్కులో ఏర్పాటు చేసిన పలు రకాల నమూనాలను మంత్రి తిలకించారు.

రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్కు.. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఎన్నో వ్యయప్రయాసలు పడి జలమండలి వందల కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా, గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి, నగర వాసులకు సరఫరా చేస్తుందన్నారు. ఈ నీటిని ప్రజలు వృథా చేస్తే ప్రభుత్వానికి నష్టంతో పాటు రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని తెలిపారు. మంచినీటి వృథాను అరికట్టడానికి జలమండలి రూపొందించిన వాక్‌ కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు. ప్రజలు, అధికారులు సమష్టిగా నీటి వృథాపై అవగాహన కార్యక్రమాలు చేపట్ట డం శుభ పరిణామమని మంత్రి అన్నారు. జలమండలి క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వర కు తయారుచేసిన యూనిఫామ్‌ జాకెట్‌ను, ‘వాక్‌’ వివరాలు నమోదు చేసుకోవడానికి రూ పొందించిన డైరీని కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంఏయూడీ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ అర్వింద్‌ కుమార్, జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, జలమండలి డైరెక్టర్లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు