హరిత పట్నం కావాలి: కేటీఆర్‌

14 Jun, 2020 01:35 IST|Sakshi

20 నుంచి హరితహారం

ప్రతి శుక్రవారం గ్రీన్‌ ఫ్రైడేగా పాటించాలి

ప్రతి పురపాలిక బడ్జెట్లో 10% నిధులు గ్రీనరీకి ఖర్చుచేయాలి

పట్టణానికో ట్రీ–పార్క్‌ ఏర్పాటు చేయాలి

మునిసిపల్‌ చైర్మన్, కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్ ‌: మరోసారి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను హరిత పట్టణాలుగా మార్చేందుకు కృషి చేయాలని పురపాలక మంత్రి కె.తారకరామారావు కోరారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలంతా చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు, జిల్లా అడిషనల్‌ కలెక్టర్లతో శనివారం ఇక్కడ ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి పట్టణ పురపాలిక బడ్జెట్లో 10 శాతం హరిత బడ్జెట్‌గా ఉండాలన్న నిబంధనను నూతన పురపాలక చట్టం చెబుతోందని, హరిత పట్టణాలుగా తీర్చిదిద్దడానికి ఈ నిధులను వినియోగించుకోవాలని సూచించారు.

గ్రీన్‌ బడ్జెట్‌ వినియోగంపైన భవిష్యత్‌లో సమగ్ర సమీక్ష ఉంటుందని, హరితహారం, గ్రీన్‌ బడ్జెట్‌ను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. మొక్కలను నాటడం, వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మునిసిపల్‌ కమిషనర్, చైర్‌పర్సన్లదే అన్నారు. కనీసం 85% నాటిన మొక్కలను కాపాడాలని చెప్పారు. ప్రతి శుక్రవారం గ్రీన్‌ ఫ్రై డేగా పాటించి నాటిన చెట్లను సంరక్షించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డంప్‌ యార్డుల వద్ద సువాసనలు వెదజల్లే మొక్కలు నాటాలని, సాధ్యమైనంత ఎక్కువ ఎత్తు ఉన్న మొక్కలను నాటితే వాటి సంరక్షణ  సులువు అవుతుందన్నారు. దోమలను తరిమే మస్కిటో రిప్పెలంట్‌ చెట్లను నాటాలన్నారు. ప్రతీ పట్టణానికి ఒక ట్రీ–పార్క్‌ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 90 పట్టణాలకు దగ్గర్లో అటవీ బ్లాకులు అందుబాటులో ఉన్నాయని, వీటిలో చెట్లు నాటేందుకు పురపాలకలు ముందుకు రావాలని కోరారు. ప్రతి పట్టణంలో స్మృతి వనాలను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తగిన కార్యాచరణ చేపట్టాలన్నారు. పట్టణాల్లో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు మున్సిపల్‌ శాఖ డైరెక్టరేట్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. 

ఉధృతంగా పారిశుద్ధ్య పనులు..
జీహెచ్‌ఎంసీతో సహా అన్ని పురపాలికలకు ప్రతినెలా రూ.148 కోట్ల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధులను నేరుగా విడుదల చేస్తున్నామని, ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చామన్నారు. ఈ నిధులతో పారిశుద్ధ్యంతో పాటు ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అవసరమైన కార్యచరణ చేపట్టిందని తెలిపారు. సీఎం సూచన మేరకు ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌ని కూడా చేపట్టామన్నారు. ఈ సీజన్‌ మొత్తం సాధారణంగా చేసే పారిశుద్ధ్యానికి అదనంగా నాలుగు రెట్లు ఎక్కువ కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. పౌరుల భాగస్వామ్యంతో ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రతి ఒక్కరు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇల్లందులో పట్టణ ప్రగతి నిర్వహణపై ఒక నివేదికను రూపొందించి మంత్రికి పంపించిన మునిసిపల్‌ చైర్మన్‌ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, మునిసిపల్‌ కమిషనర్‌ను కేటీఆర్‌ అభినందించారు. ఇదే తరహాలో పట్టణ ప్రగతికి ముందు, తర్వాత ఉన్న పరిస్థితులను పొటోలతో సహా ఒక రిపోర్ట్‌ తయారు చేసి అందరికీ అందుబాటులో ఉంచితే ప్రజలకి తాము చేస్తున్న కార్యక్రమాలు అర్ధమవుతాయని మంత్రి సూచించారు. 

>
మరిన్ని వార్తలు