జిల్లాలో మళ్లీ కొత్త కేసులు నమోదు కావొద్దు: కేటీఆర్‌

15 Apr, 2020 18:54 IST|Sakshi
వేములవాడలోని కరోనా రెడ్‌ జోన్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌

సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. వేములవాడలోని కోవిడ్‌ ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు  ధైర్యం చెప్పారు. రెడ్ జోన్ ఏరియాలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందుతున్నాయా అని మంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సామాజిక దూరం పాటించి.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. మే 3 వరకు ఇళ్ళకే పరిమితం కావాలి ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
(చదవండి: లాక్‌డౌన్‌ : నలుగురికి స్పూర్తిగా)

అమెరికా ఏం చేయలేకపోయింది..
అగ్రరాజ్యమైన అమెరికా కరోనా వైరస్‌ను తట్టుకోలేకపోయిందని, అక్కడ శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని తెలిపారు. కరోనాకు నియంత్రణనే మందు అని గుర్తు చేశారు. కరోనా సోకకుండా జిల్లా యంత్రాంగం అప్రత్తమైందని.. జిల్లాలో ఒకే ఒక పాజిటివ్ కేసు నమోదైందని వెల్లడించారు. జిల్లాలో మళ్లీ కొత్త కేసులు నమోదు కావద్దని, అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
(చదవండి: మళ్లీనా!)

‘దేశానికే తెలంగాణ అన్నపూర్ణ. ఎండాకాలంలో మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. పల్లెల్లో భౌతిక దూరం పాటిస్తున్నారు. కానీ, పట్టణాలలో యువత పాటించడం లేదు. ప్రజలు అధికారులకు సహకరించాలి. లేని యెడల చట్ట రీత్యా చర్యలు తప్పవు. రాబోయే మరో రెండు వారాలు ప్రజలు సహకరించాలి. త్వరలో కరోనా రహిత రాష్ట్రంగా  తెలంగాణను ప్రకటించుకుందాం’అని మంత్రి అన్నారు.

మరిన్ని వార్తలు