ఆపదలో పోలీసులే దేవుళ్లు 

1 Feb, 2018 03:16 IST|Sakshi
ఆర్‌బీవీఆర్‌ టీఎస్‌పీఏలో పరేడ్‌ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు, (ఇన్‌సెట్‌)లో మాట్లాడుతున్న నాయిని నర్సింహారెడ్డి

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి 

టీఎస్‌పీఏలో మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ 

ప్రజల సేవకులు పోలీసులు: డీజీపీ మహేందర్‌ రెడ్డి

సాక్షి, రంగారెడ్డి: ఆపద సమయంలో బాధితులకు పోలీసులే దేవుళ్లని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించే వారికి సత్వర న్యాయం అందించాలన్నారు. బుధవారం రాజాబహద్దూర్‌ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శిక్షణ కేంద్రం (ఆర్‌బీవీఆర్‌ టీఎస్‌పీఏ)లో శిక్షణ పూర్తి చేసుకున్న 735 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ఘనంగా నిర్వహించారు. సివిల్‌ 452, ఏఆర్‌ 283 మహిళా కానిస్టేబుళ్లు ఇక్కడ శిక్షణ పొందారు. పాసింగ్‌ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హోంమంత్రి హాజరయ్యారు. మహిళా కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన.. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపికలు అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మునుపటిలా పరిస్థితులు లేవని, ప్రజల్లో చైతన్యం బాగా పెరిగిందన్నారు. చట్టానికి లోబడి గౌరవప్రదంగా విధులు నిర్వహించాలని మహిళా కానిస్టేబుళ్లకు సూచించారు. ఆపదలో పోలీస్‌ స్టేషన్‌ మెట్లు తొక్కే మహిళలను ఒక స్త్రీగా ఓపికతో సమస్యలు తెలుసుకుని న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. దేశంలో అత్యుత్తమ పోలీస్‌ శిక్షణ కేంద్రాల్లో టీఎస్‌పీఏ ఒకటని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి పోలీస్‌ స్టేషన్‌ దేవాలయంలా కనిపిస్తుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. 

మెరుగైన సేవలు అందిస్తే పోలీస్‌ని దేవుడిలా చూస్తారన్నారు. ప్రజలు చెల్లించిన పన్నులతోనే జీతాలు పొందుతున్న విషయాన్ని గుర్తించి.. వారిని యజమానులుగా భావించాలని సూచించారు. క్షేత్రస్థాయిలోనూ మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ అందజేశామని పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ జితేందర్‌ పేర్కొన్నారు. తొమ్మిది నెలల శిక్షణలో భాగంగా చట్టం, ఆయుధాల వాడకం, సాంకేతిక వినియోగం తదితర అంశాలపై తర్ఫీదు ఇచ్చామని వివరించారు.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా