విద్యావంతులకు భరోసా కల్పించేలా!

21 Feb, 2019 02:43 IST|Sakshi
సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వ్యవసాయరంగంలో మార్పులు జరగాలి

పంటకు గిట్టుబాటు ధరతోనే ఇది సాధ్యం 

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

ఉద్యోగంతో కలిగే నమ్మకం వ్యవసాయంతోనూ కలగాలి 

రైతుబంధు రైతు జీవితాన్నే మార్చేసింది 

వ్యవసాయ బాధ్యతలు అప్పగించడం తన అదృష్టమని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ‘చదువుకున్న వారికి ఉద్యోగం ఎలా భరోసా ఇస్తుందో.. వ్యవసాయం కూడా అలాంటి భరోసానే ఇవ్వాలి. అప్పుడే చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేసేందుకు ముందుకొస్తారు. అప్పుడు వ్యవసాయం, అనుబంధ రంగా ల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగ సమస్య అనేదే ఉండదు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరతో సరిపెట్టకుండా గిట్టుబాటు ధర అందిస్తేనే ఇదిసాధ్యమవుతుంది. ఇందు కు కేంద్రమే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి’అని తెలంగాణ కొత్త వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. 

నా ఆసక్తిని గుర్తించే! 
నాకు వ్యవసాయమంటే ఎంతో మక్కువ. సీఎం కేసీఆర్‌ ఈ శాఖ ఇస్తానని నాకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే వ్యవసాయరంగంపై నాకున్న ఇష్టాన్ని గుర్తించే ఈ బాధ్యతలు అప్పగించారని భావిస్తున్నాను. వ్యవసాయశాఖను అప్పగించడం సంతోషంగా ఉంది. రైతులకు నేరుగా సాయం చేయడానికి వీలున్న శాఖ కావడం అదృష్టం. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాల కారణంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా పోయాయి. ఏవైనా వ్యక్తిగత కారణాలతో అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు.. కానీ వ్యవసాయానికి వాటితో సంబంధం లేదు. రాష్ట్రంలో రైతు ధీమాతో ఉన్నాడు. జీవితానికి ఢోకా లేదన్న భావన రైతులందరిలో నెలకొని ఉంది. 

ఉద్యోగులకు డీఏ.. మరి రైతులకు? 
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తారు. రెండు మూడేళ్లకోసారి ద్రవ్యోల్బణాన్ని లెక్కగట్టి ధరల పెరుగుదలను బట్టి జీతాన్ని పెంచుతారు. కానీ రైతులకు ఇలాంటి వెసులుబాటేదీ? అంటే డీఏ ఇవ్వాలని నా ఉద్దేశం కాదు. వ్యవసాయం రోజురోజుకు భారంగా మారుతోంది. సాగు ఖర్చు పెరుగుతుంది. కానీ ఆ మేరకు రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావడంలేదు. కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) మాత్రమే ఇస్తుంది. సాగు ఖర్చును లెక్కలోకి తీసుకొని గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఈ బాధ్యత కేంద్రానిదే. ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. రైతును పట్టించుకోవాలి.

రైతుబంధుతో కేంద్రంలో కదలిక 
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాక కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 70 ఏళ్ల తర్వాత రైతు గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అయితే కేంద్రం ఐదెకరాలలోపు రైతులకు ఏడాదికి కేవలం రూ.6 వేలు ప్రకటించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇస్తుంది. వచ్చే ఖరీఫ్‌ నుంచి రూ.10 వేలు ఇవ్వనుంది. ఆ ప్రకారం ఎకరా భూమి కలిగిన వృద్ధ రైతులుం టే, వారికి వృద్ధాప్య పింఛన్‌ కూడా వస్తుంది. అంటే ఒక రైతుకు నెలకు రూ.2వేల చొప్పున ఏడాదికి రూ.24 వేల పింఛ న్‌ సహా ఇవి రెండూ కలిపితే ఏడాదికి రూ.34 వేలు వస్తుంది. తెలంగాణలో 90% మం ది రైతులకు తెల్ల రేషన్‌ కార్డులున్నాయి. ఐదెకరాల భూమి కలిగి ఉండి వృద్ధాప్య పింఛన్‌ అందుకునే వారికి ఏడాదికి రూ.74 వేలు వస్తాయి. రైతుకు మన రాష్ట్రం చేస్తున్న సాయం దేశంలో ఇప్పటివరకు ఎక్కడా చేయలేదు. ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. రైతును ఆదుకోవాలి. 

రైతు సమన్వయ సమితులతో విప్లవం 
రైతు సమన్వయ సమితి సభ్యులు ఒక రైతు సైన్యం లాంటిది. దీని ఏర్పాటు ఒక విప్లవాత్మకమైన చర్య. వ్యవసాయ ఉద్యోగులు కొంతమేరకే రైతులతో మమేకం కాగలరు. వారు సాంకేతికంగా చేదోడు వాదోడుగా ఉండగలరు. రైతు సమన్వయ సమితులు మాత్రం రైతులను సంఘటితం చేసి వారికి గిట్టుబాటు ధర ఇవ్వడం మొదలు అనేక రకాలుగా సాయపడగలరు. రైతు సమన్వయ సమితులను మరింత పకడ్బందీగా ఉపయోగించుకునేలా మార్గదర్శకాలు తయారు చేయాల్సిన అవసరముంది. వారికి కేసీఆర్‌ గౌరవ వేతనం ఇస్తానన్న విషయం తెలిసిందే. వీటన్నింటిపై మార్గదర్శకాలు రూపొందిం చాక స్పష్టత వస్తుంది. వారి విధులు, బాధ్యత, శిక్షణ ఇచ్చి రైతులకు చేదోడు వాదోడుగా ఉండేలా చూడాలి. ఇదో ఉద్యమంలాగా జరగాలి.

వ్యవసాయంతో..ఉద్యోగం ఇచ్చే భరోసా 
ఉద్యోగం కోసం యువతీ యువకులు నానాపాట్లు పడుతున్నారు. ఎందుకంటే అక్కడ భరోసా ఉంది. కానీ వ్యవసాయంలో ఎవరికీ భరోసా రావడంలేదు. ఆహారశుద్ది పరిశ్రమలతోపాటు ఇంకా అనేక అవకాశాలపై దృష్టిసారించాలి. అందుకోసం మేధోమథనం చేయాల్సి ఉంది. ఈ విషయంలో నా ఆలోచనను సీఎంకు వెల్లడిస్తాను. తెలంగాణలో సాగునీటి వనరులు సమకూరుతున్నకొద్దీ.. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. సాగునీటి వనరులు సమకూరినచోట రైతులు వ్యవసాయం మొదలుపెట్టారు. దీంతో ట్రాక్టర్ల అవసరం ఏర్పడింది. ట్రాక్టర్‌ షోరూంలు ఏర్పడ్డాయి. సాంకేతిక సిబ్బంది అవసరమైంది. ఇలా వ్యవసాయానికి తోడుగా అనేక ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నా యి. అలా యువకులు వ్యవసాయంపై భరోసాతో ముందుకు రావాలి. రైతుకోసం దేశంలో ఒక నూతన అధ్యాయం మొదలుకావాలంటే తెలంగాణ రాష్ట్రమే దారి చూపించాల్సి ఉంది. అందుకోసం సీఎం నిరంతరం ఆలోచిస్తున్నారు.

మరిన్ని వార్తలు