మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

23 Jul, 2019 08:19 IST|Sakshi
తల్లి తారకమ్మకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న మంత్రి

తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు

మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పరామర్శ

వనపర్తి/పాన్‌గల్‌: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి సింగిరెడ్డి తారకమ్మ (105) సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. మంత్రి కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. వందేళ్ల వయస్సు దాటిన ఆమె వనపర్తిలోని మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలోనే ఇన్నాళ్లు ఉన్నారు. రోజూలానే ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రించగా.. సోమవారం తెల్లవారుజామున ఆయాస పడుతూ కనిపించింది. మంత్రి ఆస్పత్రికి తరలిద్దామని ప్రయత్నిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. మంత్రితోపాటు వారి చెల్లెళ్లు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.  

ప్రముఖుల పరామర్శ 
విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ మంత్రిని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారితోపాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అబ్రహం, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లా కలెక్టర్లు రోనాల్డ్‌రోస్, శ్వేతామహంతి, శ్రీధర్, శంశాంక్, వనపర్తి ఎస్పీ కె. అపూర్వరావు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి, స్వర్ణసుధాకర్‌రెడ్డి, పద్మావతి, టీడీపీ, బీజేపీ నాయకులు, ఆయా జిల్లాల జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. అలాగే, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టులు మంత్రి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

 రాయినిపల్లి శివారులో అంత్యక్రియలు
సింగిరెడ్డి తారకమ్మ అంత్యక్రియలు పాన్‌గల్‌ మండలం రాయినిపల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసం నుంచి రాయినిపల్లి శివారు వరకు సాగిన అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు,  అభిమానులు, ప్రజలు బంధువులు తరలివచ్చారు. తన వ్యవసాయక్షేత్రంలో మంత్రి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి తలకొరివి పెట్టారు. తల్లి తారకమ్మకు కన్నీటితో తుదివీడ్కోలు పలికారు. 

మరిన్ని వార్తలు