పరిమళించిన హృదయ ‘పద్మం’!

15 Jul, 2018 11:38 IST|Sakshi

చిత్తు కాగితాల రిక్షా  లాగుతున్న చిన్నారి 

బాలికను లాలించిన  మంత్రి పద్మారావు  

వివరాలు అడిగి తెలుసుకున్న అమాత్యుడు  

అది సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ ప్రాంతం. అప్పుడు సమయం రాత్రి సుమారు ఏడెనిమిది గంటలు కావస్తోంది. వాహనాలు రొద చేస్తూ రోడ్డుపై వెళ్తున్నాయి. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇదే రహదారిలో ఓ చిన్నారి చిత్తు కాగితాలను ఏరుకుని వాటిని రిక్షాలో వేసుకుని తోసుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో పాత జైలు సమీపంలోని ఓ కళ్లద్దాల దుకాణంలో కూర్చుని ఉన్న మంత్రి పద్మారావు ఆ చిన్నారి కష్టాన్ని కళ్లారా చూశారు. ఆ దృశ్యం ఆయన మనసును కదిలించింది. వెంటనే తన భద్రతా సిబ్బందితో బాలికను పిలుచుకు రమ్మని ఆదేశించారు. వారు ఆమెను మంత్రి చెంతకు తీసుకువచ్చారు.

 పద్మారావు తన సొంత కూతురిలా ఒడిలో కూర్చోపెట్టుకుని మరీ ఆ చిన్నారిని లాలించారు. ఆమె కుటుంబానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పేరు విజయలక్ష్మి అని.. సికింద్రాబాద్‌ తుకారాంగేట్‌ వద్ద ఉంటున్నామని చెప్పింది. తల్లి సరోజ నిత్యం మోండా మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తోందని వివరించింది. తాను సికింద్రాబాద్‌ సుభాష్‌ రోడ్‌లోని నాగెల్లి దుర్గయ్య స్మారక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నానంది. చదువుకుంటూనే నిత్యం తల్లి ఏరితెచ్చే చిత్తు కాగితాలను దుకాణంలో విక్రయిస్తుంటానని చెప్పింది.

 మోండా మార్కెట్‌ వద్ద తల్లి పోగుచేసిన చిత్తు కాగితాల మూటలను ప్రతిరోజూ రాత్రి ఏడు గంటల సమయంలో మూడు చక్రాల బండిలో వేసుకుని రాంగోపాల్‌పేట్‌లోని ఓ దుకాణానికి తీసుకెళ్లి అమ్ముతానంది. పదకొండేళ్ల చిన్న వయసులోనే బతుకు బండిని లాగడంలో తల్లికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న విజయలక్ష్మిని మంత్రి పద్మారావు అభినందించారు.  ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తానన్నారు. ఈ ఉదంతం శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మంత్రి చలించిన తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.                 
 – బన్సీలాల్‌పేట్‌

మరిన్ని వార్తలు