తీర్థాల ఘటనపై మంత్రి, కలెక్టర్‌ సీరియస్‌

27 Jun, 2020 13:05 IST|Sakshi

సాక్షి, ఖమ్మం :  ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో ఇళ్లు కూల్చేందుకు వెళ్లిన అధికారులపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, కలెక్టర్ ఆర్.వీ కర్ణన్‌లు సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో ఇల్లు కూల్చడానికి వచ్చామన్న అధికారుల వాదనపై మంత్రి పువ్వాడ అజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ.. తాను ఆదేశాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఎలా చెబుతారంటూ మండిపడ్డారు. దేవాదాయ శాఖ కమిషనర్‌కు సంబంధిత అధికారులను సరెండర్ చేస్తామని అన్నారు. అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్‌ ఆర్.వీ కర్ణన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొసీజర్ పాటించకుండా అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (సోషల్‌ మీడియాలో‘జస్టిస్‌ ఫర్‌.. పోస్టులు)

కాగా, తీర్థాలలోని సంగమేశ్వరస్వామి ఆలయ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించారంటూ శనివారం అధికారులు వాటిని కూల్చేందు యత్నించారు. ఈ ఉదయం రెవెన్యూ, పోలీసులు, దేవాదాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు అక్కడికి చేరుకోగా.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గూమిగూడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సర్పంచి బాలూనాయక్‌ ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించగా..

సర్పంచి భార్య, ఆమె సోదరుడు రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో కోప్రోద్రిక్తులైన గ్రామస్థులు అధికారులతో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో దేవాదాయ అధికారులు అక్కడి పరిస్థితిని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌కు ఫోన్‌లో వివరించారు. కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులంతా అక్కడినుంచి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు