అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం

15 Jul, 2018 12:16 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి మహేందర్‌రెడ్డి

సాక్షి, వికారాబాద్‌: అక్రమ మైనింగ్‌కు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాలని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో శనివారం ఆయన జిల్లా అధికారులతో మైనింగ్, మినరల్స్, హరితహారం తదితర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి తదితరాలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా నవాబుపేట, ధారూరు, యాలాల, బషీరాబాద్, పరిగి తదితర మండలాల్లో ఇసుక, ఇతర మైనింగ్‌ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. అక్రమార్కులతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా రోడ్లు దెబ్బతింటున్నాయని మంత్రి చెప్పారు. అక్రమ మైనింగ్, రవాణా విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించరాదని సూచించారు. అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్‌తో పర్యావరణ సమత్యులం దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మిట్ల గడువు పూర్తయినా ఇంకా కొందరు అక్రమంగా గనులను తవ్వడం, ఒకచోట పర్మిట్లు తీసుకొని మరోచోట తవ్వకాలు చేపట్టడం వంటివి చేస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

పర్మిట్‌ తీసుకున్న విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలను నిర్వస్తున్న వారిపై నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో గనుల ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా 150 కిలోమీటర్ల మేర రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిని నాణ్యతా ప్రమాణాలతో బాగు చేయాలంటే రూ.35 కోట్లు అవసరమవుతాయన్నారు. జిల్లాలో మైనింగ్‌పై ఏటా ప్రభుత్వానికి రూ.47.81 కోట్ల ఆదాయం వస్తుందని, ఇందులో మైనింగ్‌ ప్రభావిత గ్రామాలకు 30 శాతంమేర నిధులను అందించనున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్‌ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. గనుల ప్రభావిత ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్‌ ప్రాంతాల్లో రెండేసి చొప్పున ఆరు డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుకను అందించాలని సూచించారు. జిల్లాలో 125 మైనింగ్‌ లైసెన్సులు రెన్యూవల్‌ దశలో ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేస్తామని అధికారులు మంత్రికి వివరించారు.  మైనింగ్‌ నిధులతో జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ స్థలంలో రూ.2.5 కోట్ల వ్యయంతో సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియం నిర్మించే ప్రతిపాదనలకు మంత్రి మహేందర్‌రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వానికి వచ్చే మైనింగ్‌ ఆదాయాన్ని అన్ని ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న బయో మరుగుదొడ్లు నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయన్నారు.

వీటి స్థానంలో సాధారణ మరుగొదొడ్లను నిర్మించేందుకు అనుమతించాలని సూచించారు. కలెక్టర్‌ ఉమర్‌ జలీల్‌ మాట్లాడుతూ.. మైనింగ్‌కు సంబంధించి ఇప్పటికే 40 ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు జీపీఎస్‌తో అనుసంధానం చేశామని తెలిపారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు సంజీవరావు, రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, జేసీ అరుణకుమారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జాన్సన్, పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు