మీరు మారరా?

26 Mar, 2020 12:12 IST|Sakshi

పాలమూరు: ‘మీరు మారరా? పోలీసు సిబ్బంది ఇంతలా శ్రమిస్తున్నా.. మీలో మార్పు రాదెందుకు? మీ శ్రేయస్సు కోసమే కదా పగలు, రాత్రి తేడా లేకుండా కృషి చేస్తోంది.. అనర్థమని తెలిసినా మీకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు?’ సాక్ష్యత్తు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ రోడ్లపై వెళ్తున్న వాహనదారులను ఆపి అన్న మాటలు ఇవి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు వాహనదారులకు మంత్రి జరిమానా కూడా విధించారు. లాఠీ పట్టుకొని పట్టణ రోడ్లపై తిరిగి వాహనదారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బుధవారం ఆయన పట్టణంలో లాక్‌డౌన్‌ పరిస్థితులను పరిశీలించడమేగాక కొత్త కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేసే ప్రదేశాలను తనిఖీ చేశారు. పట్టణంలోని రైతుబజార్, క్లాక్‌టవర్, అశోక్‌ టాకీస్‌ చౌరస్తా, కొత్త రైతుబజార్‌ ఏరియాల్లో పర్యటించటంతో పాటు రోడ్లపై వెళ్తున్న వారిని ఆపి బయటకు రావొద్దని చెప్పినా వినకుండా ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.

అబ్ధుల్‌ ఖాదర్‌ దర్గా వద్ద కొత్తగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను పరిశీలించి కూరగాయలతో పాటు నాన్‌వెజ్‌ మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేయాలని, భవనం ముందు తాత్కాలికంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రజలు ఉదయమే మార్కెట్‌కు వచ్చి కూరగాయలు కొనేందుకు అవకాశం కల్పించాలని, ముఖ్యంగా గుంపులుగా కాకుండా దూరం దూరం ఉండి కూరగాయలు కొనేలా చర్యలు చూడాలన్నారు. మార్కెట్‌లో లిఫ్ట్, ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అనంతరం బస్టాండ్‌లో తాత్కాలిక మార్కెట్‌ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అంతేగాక బీఈడీ కళాశాల వద్ద కొత్తగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్‌లో కూడా మహబూబ్‌నగర్‌ రూరల్‌ ప్రాంతానికి చెందిన ప్రజలకు అనుకూలంగా ఉండేలా కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని, వీటన్నింటిని గురువారం ప్రారంభించాలన్నారు. వీటితో పాటు జడ్చర్లలో 2, దేవరకద్రలో 2, భూత్పూర్‌లో ఒక కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించి ప్రజలు కూరగాయలకు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 10 సంచార వాహనాలను సైతం ఏర్పాటు చేసి వీధుల్లో తిప్పాలన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా