డబుల్‌ వేగం..!

31 Jan, 2018 15:46 IST|Sakshi
ఈనెల 28న డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి ఐకే రెడ్డి        

     జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి 

     సమీక్ష సమావేశంలో నిర్మాణాలపై స్పష్టత 

     నిర్మల్‌లో 160ఇళ్ల నిర్మాణాలకు  ఈ నెల 28న శంకుస్థాపన

      ఫిబ్రవరిలో విస్తృతంగా పనుల ప్రారంభం..! 

     ఆశలు పెంచుకుంటున్న పేద కుటుంబాలు 

     ఎల్లపెల్లిలో ఇళ్ల పంపిణీలో జాప్యం

నియోజకవర్గాలకు ఇళ్ల కేటాయింపు ఇలా 
నిర్మల్‌ : 1400
ముథోల్‌ : 1400
ఖానాపూర్‌ : 560 
మొత్తం : 3,360

పరిపాలన ఆమోదం : 2,626
టెండర్లు పిలిచినవి : 1,740
టెండర్లు పూర్తయినవి : 533
నిర్మాణం పూర్తయినవి : 45
నిర్మాణంలో ఉన్నవి : 24
శంకుస్థాపన చేసినవి
: 160

నిర్మల్‌ : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తోంది. ఇప్పటివరకు కాంట్రాక్టర్ల సమస్యతో జిల్లాలో ఈ పథకం నత్తకే నడక నేర్పేలా సాగుతోంది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న తన ఇలాఖాలోనే ఇళ్ల నిర్మాణంలో వెనుకంజలో ఉండడంపై అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సీరియస్‌గా దృష్టిపెట్టారు. ఇక జిల్లాలో ఎలాగైన ఈ పథకం విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ‘డబుల్‌’ స్పీడ్‌ పెంచేలా అధికారులతో ఇటీవలే సమీక్షించారు. ఈమేరకు ఆదివారం నిర్మల్‌లో 160ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. త్వరలో మరిన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించనున్నట్లు పేర్కొ న్నారు. ఏడాదిలోపే నిర్మాణా లను పూర్తిచేసి అర్హులందరికీ అందిస్తా మని చెప్పారు. ఈక్రమంలో పేదల ఆశలూ ‘డబుల్‌’ అయ్యాయి. 


స్పీడ్‌ పెంచాల్సిందే..     

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మే రకు అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో  జిల్లా చాలా వెనుకబడి ఉంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 3,360 ఇళ్లు కేటాయించారు. ఇందులో 2,626 గృహాలకు మాత్రమే పరిపాలన అనుమతులు లభించాయి. ఇందులో 1,763 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలవగా 533 మాత్రమే టెండర్‌ ఆమోదం పొందాయి. ఇక ఇందులో ఇప్పటివరకు కేవలం 45ఇళ్లు మాత్రమే పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. మరో 24 ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన 45ఇళ్లు, నిర్మాణంలో ఉన్న 24ఇళ్లు కూడా నిర్మల్‌ రూరల్‌మండలంలోని మంత్రి స్వగ్రామం ఎల్లపెల్లిలోనివే. జిల్లాలో మరెక్కడా ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టలేదు. 


కాంట్రాక్టర్లే అసలు సమస్య.. 


రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలవగానే మొదట్లో కాంట్రాక్టర్లు క్యూకట్టారు. తీరా.. ప్రభుత్వం ఇస్తున్న నిధులతో క్షేత్రస్థాయిలో నిర్మించాలంటే ఎదురవుతున్న ఇబ్బందులతో ఒక్కొక్కరూ ముఖం చాటేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిని రూరల్‌ ఏరియాలో రూ.5.04లక్షలతో, అర్బన్‌లో రూ.5.30లక్షలతో నిర్మించాలంటోంది. ఈ పరిధిలో ప్రస్తుత మార్కెట్లో కష్టమంటున్నారు కాంట్రాక్టర్లు. ఒక్కో ఇల్లుకు కనీసం రూ.6.50లక్షల వరకు ఖర్చవుతుంది. ఇక పన్నులు వ్యాట్‌ నుంచి జీఎస్టీకి మారినా ప్రభుత్వం పర్సంటేజీ పెంచకపోవడమూ కాంట్రాక్టర్ల వెనుకంజకు కారణమవుతోంది. వ్యాట్‌ అమలులో ఉన్నప్పుడే తాము నష్టపోతామని వెనుకంజ వేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం వ్యయం పెంపుపై స్పందించకపోవడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇవ్వకపోవడంతో విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జిల్లాలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపడతామని టెండర్‌ తీసుకున్న ఏఎన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పత్తాలేకుండా పోయింది. దీంతో అధికారులు మళ్లీ కొత్త కాంట్రాక్టర్లను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


మంత్రికి ప్రతిష్టాత్మకం.. 


రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన ఇలాఖాలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈనేపథ్యంలోనే టెండర్‌ తీసుకున్న కాంట్రాక్టర్‌ వెనుకంజ వేసినా.. జిల్లాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌ లక్కడి జగన్‌మోహన్‌రెడ్డిని ఒప్పించి, తన స్వగ్రామం, దత్తత గ్రామమైన ఎల్లపెల్లిలో 45ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చేశారు. సదరు కాంట్రాక్టర్‌ సైతం ఈ ఇళ్లను శరవేగంగా సకల హంగులతో పూర్తి చేసి ఇచ్చారు. అదే గ్రామంలో మరో కాంట్రాక్టర్‌తో 24ఇళ్లను మంత్రి నిర్మింపజేయిస్తున్నారు. ఇక తమ స్వగ్రామానికే పథకాన్ని పరిమితం చేశారన్న విమర్శలు రావడంతో జిల్లావ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.  


నిర్మల్‌లో 160ఇళ్లకు.. 


అర్బన్‌ ప్రాంతమైన నిర్మల్‌లో ఈనెల 28న 160 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పట్టణ శివారులోని బంగల్‌పేట్‌ మహాలక్ష్మి మందిరం సమీపంలో వీటి నిర్మాణం కోసం స్థలం కేటాయించారు. నిర్మల్‌ నియోజకవర్గానికి 1400 ఇళ్లు కేటాయించారు. ఇందులో 1,226 నిర్మాణాలకు పరిపాలన అనుమతులు లభించాయి. ఎల్లపెల్లిలో 45 నిర్మాణాలు పూర్తికాగా, 24ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. తాజాగా ఆదివారం నిర్మల్‌లోని బంగల్‌పేట్‌ శివారులో మరో 160ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే వీటి నిర్మాణాలు ప్రారంభించేలా చూస్తామని మంత్రి పేర్కొన్నారు. 


ఎల్లపెల్లిలో ఎదురుచూపులు.. 


ఎల్లపెల్లిలో 45ఇళ్లను విశాలంగా నిర్మించారు. ఒక్కో ఇంటిలో హాల్, కిచెన్‌తోపాటు రెండు పడక గదులు నిర్మించారు. అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ సిస్టం, అన్ని ఇళ్లకూ కామన్‌గా సెప్టిక్‌ట్యాంకును ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ.. ఇళ్ల నిర్మాణం పూర్తయి నెలలు గడిచిపోయాయి. లబ్ధిదారుల ఎంపికను మొదటి గ్రామసభలో పూర్తిచేశారు. మొత్తం 45మంది లబ్ధిదారులతో కూడిన జాబితానూ రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. గత కలెక్టర్‌ ఈ జాబితాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడంతో అలా ఆగిపోయింది. కొత్త కలెక్టర్‌ ప్రశాంతి వచ్చాక పూర్తయిన ఇళ్లు, లబ్ధిదారుల జాబితానూ పరిశీలించినట్లు తెలిసింది. కానీ ఇప్పటికీ ఇళ్ల పంపిణీ మాత్రం చేపట్టడం లేదు. త్వరలో రెండో గ్రామసభ పెట్టి ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టేందుకే ఆపారని అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.   
 

మరిన్ని వార్తలు