ఖరారు కానున్న సెట్స్‌ తేదీలు

17 Jul, 2020 01:37 IST|Sakshi

ఎంసెట్‌ నిర్వహణపై నేడు మంత్రి సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: వివిధ వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) తాజా తేదీలు శుక్రవారం ఖరారు కానున్నాయి. కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన ప్రభుత్వం ఈనెల 1వ తేదీ నుంచి వరుసగా ఈసెట్, ఎంసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా గతంలో షెడ్యూలు జారీ చేసింది. అయితే కరోనా ఉధృతి తగ్గని పరిస్థితుల్లో పరీక్షలను ఎలా నిర్వహిస్తారంటూ కోర్టులో కేసు వేయడంతో పరీక్షలను మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్‌ను సెప్టెంబర్‌ 1 నుంచి 6 వరకు నిర్వహించేలా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తాజా షెడ్యూల్‌ జారీ చేసిన నేపథ్యంలో అదే పద్ధతిలో రాష్ట్రంలోనూ సెట్స్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలోనూ దీనిపై చర్చించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేయడంతో తదుపరి కార్యాచరణపై ఉన్నత విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎంసెట్‌ నిర్వహణపైనా చర్చించనున్నారు. దాంతోపాటు ఇతర సెట్స్‌ నిర్వహించే తేదీలను కూడా ఖరారు చేయనున్నారు. 

మరిన్ని వార్తలు