-

లాభసాటిగా వ్యవసాయం

17 Apr, 2015 00:43 IST|Sakshi
లాభసాటిగా వ్యవసాయం

రైతులతో ఇష్టాగోష్టిలో  కేంద్ర మంత్రి వెంకయ్య
 
హైదరాబాద్: డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని, టీచర్ కొడుకు టీచర్ కావాలని కోరుకుంటున్నా ప్రస్తుత పరిస్థితుల్లో రైతు కొడుకు మాత్రం రైతు కావాలని కోరుకోవట్లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుద్దామని అన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘రైతు సమస్యలపై ఇష్టాగోష్టి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ వ్యవసాయ పనులు ఉన్న సమయాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలన్న రైతుల విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నారు. అవసరమైతే 100 రోజులున్న పనులను మరో 20 రోజులు పెంచి అయినా రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వ్యవసాయ బీమా కల్పించాలి

రైతులకు వ్యవసాయ బీమా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. బీమా ప్రీమియంపై కొంత కేంద్రం, మరి కొంత రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తూ కొంత రైతు కట్టుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు నెలకు రూపాయి చొప్పున చెల్లిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని, రోజుకు 90 పైసలు చెల్లిస్తే జీవిత బీమా కింద రూ. 2 లక్షలు వస్తుందన్నారు. అగ్రి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తే వ్యవసాయానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవచ్చన్నారు.
 
ప్రాంతీయ భాషల్లో కిసాన్ చానల్

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసారం చేసే కిసాన్ టీవీ చానల్ ప్రస్తుతం హిందీలో వస్తోందని, దానిని ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనివల్ల కొంత మేర అయినా రైతులు వారి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకుంటారన్నారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించినప్పుడే మంచి దిగుబడి వస్తుందన్నారు.
 

మరిన్ని వార్తలు