కాంగ్రెస్‌వి సిగ్గులేని వ్యాఖ్యలు

14 Sep, 2017 01:58 IST|Sakshi
కాంగ్రెస్‌వి సిగ్గులేని వ్యాఖ్యలు

రైతు నోట్లో మట్టి కొట్టేందుకు కుట్ర పోచారం, హరీశ్‌రావు ఫైర్‌
సాక్షి, సిద్దిపేట: ‘స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి పాలించిన నాయకులెవ్వరూ రైతుల గురించి ఆలోచించలేదు. తెలంగాణ రైతుల కంట కన్నీరు తుడిచి వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది అర్థం చేసుకోలేని కాంగ్రెస్‌ నాయకులు సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నారు’అని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం సిద్దిపేట మార్కెట్‌ యార్డులో జరిగిన గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

 రైతు సమితుల ఏర్పాటుపై కోర్టుకెళ్లిన కాంగ్రెస్‌ నాయకులకు కోర్టు తీర్పు చెంపపెట్టు అయిందన్నారు. వచ్చే ఖరీఫ్‌ నుంచి అర్హులైన ప్రతి రైతుకూ ఎకరానికి రూ.4 వేల చొప్పున అందచేస్తామని, కావాలంటే, కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, భట్టివిక్రమార్కలకు కూడా అందిస్తామని ఎద్దేవా చేశారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జై తెలంగాణ అన్నందుకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తే నోరు మెదపని నాయకులు.. ఇప్పుడు మాట్లాడటం శోచనీయం అన్నారు.

ఆశా, ఏఎన్‌ఎంల సేవలు భేష్‌: హరీశ్‌
‘ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న ప్రజలే నేడు.. నేను పోను బిడ్డో ప్రైవేట్‌ దవాఖానకు..’ అంటున్నారని, ఇదంతా వైద్యారోగ్యశాఖ కృషి ఫలితమేనని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చమత్కరించారు. సిద్దిపేట ఐఎంఏ హాల్‌లో ఏఎన్‌ఎంలకు ట్యాబ్స్‌ పంపిణీ, వాటి వినియోగం శిక్షణ ముగింపునకు మంత్రి అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా ప్రభుత్వ వైద్యం అందించడంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు విశేషంగా పని చేస్తున్నారన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యం పల్లెల్లోకి చేరవేయడంలో ఆరోగ్య కార్యకర్తల సేవలు అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్‌ఎంలకు 4,500 ట్యాబ్స్‌ అందచేశామని, తొలిగా పంపిణీని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభించామని చెప్పారు.

 

మరిన్ని వార్తలు