యాసంగి అంచనా.. 77.73 లక్షల టన్నులు 

3 Mar, 2020 02:16 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు ఈటల, కమలాకర్‌

పౌర సరఫరాల శాఖ అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు

నిల్వల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచన

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది యాసంగి సీజన్‌లో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 77.73లక్షల టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని, ఈ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఆరంభమయ్యే కొనుగోళ్లకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని సూచించింది.2019–20 యాసంగి కార్యాచరణపై సోమవారం హాకా భవన్‌లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు, గన్నీ సంచులు, స్టోరేజ్‌ సదుపాయం, రవాణా అంశాలపై చర్చించారు. గోదాముల్లో నిల్వ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రులు సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర, కేంద్ర గిడ్డంగుల సంస్థలతో పాటు కేంద్ర ఆహార సంస్థ,, మార్కెటింగ్‌ శాఖలు సమన్వయంతో పనిచేసి స్టోరేజ్‌ సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాల దళారులు రాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు ల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు