చర్చలు సఫలం : 16 శాతం మధ్యంతర భృతి

10 Jun, 2018 17:38 IST|Sakshi

సమ్మె నోటీస్‌ను వెనక్కి తీసుకున్న టీఎంయూ

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య వివాదం, సస్పెన్స్‌కు తెరపడింది. ఆర్టీసీ కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మంత్రి ఈటెల రాజేందర్‌ మీడియా సమవేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ వెలుగులు నింపారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని కితాబిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కార్మికులు అన్యాయానికి గురయ్యారని వెల్లడించారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు 25 శాతం మధ్యంతర భృతి అడిగారని, ఆర్టీసీ వందల కోట్ల నష్టాల్లో ఉన్నప్పటికీ 16 శాతం ఐఆర్‌ ప్రకటించినట్లు పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కార్మిక పక్షపాతి అని వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, అసంఘటిత కార్మిక సంఘాలవైపే సీఎం దృష్టి సారించారని అన్నారు. ఈ వ్యవహారంలో మంత్రి హరీష్‌ రావు అటు కార్మిక సంఘం నాయకుడిగా, ఇటు మంత్రిగా ద్విపాత్రాభినయం చేశారని కొనియాడారు. అనంతరం మంత్రి మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన 16 శాతం ఐఆర్‌తో నెలకు 16కోట్లు, ఏడాదికి 200 కోట్ల రూపాయల వరకూ భారం పెరిగిందని అన్నారు. అయినా కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉందని, లాభాల బాట పట్టించడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

మంత్రి హారీష్‌ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యమంలో నుంచి పుట్టిన సంస్థ టీఎంయూ అని, ఆర్టీసీ సంస్థ బలోపేతం చేశాక ఫిట్‌మెంట్‌ కూడా ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ నష్టాలపై హైలెవల్‌ కమిటీ వేస్తామని, తాత్కాలికంగా ఐఆర్‌ ప్రకటిస్తున్నామని, జులై నుంచి ప్రకటించిన ఐఆర్‌ను ఇస్తామని మంత్రి ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ రాయితీలన్నీ కల్పిస్తామని అన్నారు. వయసు మీరిన కార్మికుల ఉద్యోగాన్ని వాళ్ల పిల్లలకు కూడా అర్హతలను బట్టి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సకల జనుల సమ్మె సమయంలో జీతాన్ని కూడా కార్మికులకు తక్షణమే అందచేసే ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.

అనంతరం టీఎంయూ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తాము కోరిన 16శాతం ఐఆర్‌ ఫిట్మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించిందని, భవిష్యత్తులో తాము కోరిన ఫిట్మెంట్‌కు సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. చిన్న చిన్న విషయాలకు కండక్టర్లు, డ్రైవర్లపై సస్పెన్షన్ వేటు ఉండదని అన్నారు. ఇప్పటి నుంచే సమ్మె నోటీసుని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు.

సంబంధిత కథనం ఇక్కడ చదవండి : ముగిసిన చర్చలు.. కొనసాగుతున్న సస్పెన్స్‌

మరిన్ని వార్తలు