ఐక్యతకు ప్రతీక బతుకమ్మ 

25 Sep, 2019 02:51 IST|Sakshi
బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రులు తలసాని, వి.శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐక్యత, సామరస్యాలకు ప్రతీక బతుకమ్మ పండగ సంబురాలని సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్‌ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే బతుకమ్మ సంబురాల కార్యక్రమంపై హరిత ప్లాజాలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సమీక్ష నిర్వహించారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల పూల పండుగ కరపత్రాలను విడుదల చేశారు.  

ఈ నెల 28 నుంచి వరంగల్‌ జిల్లాలో భద్రకాళి అమ్మవారు ఆలయంలో 10 వేల మంది ఆడపడుచులతో బతుకమ్మ ప్రారంభం అవుతుందని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని మహిళలకు పిలుపునిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ.. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు రోజుకోక బతుకమ్మను అలంకరించి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.

మరిన్ని వార్తలు