కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద పేలుడు

3 Jul, 2015 01:21 IST|Sakshi
కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద పేలుడు

వృద్ధుడికి తీవ్రగాయాలు
కరీంనగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద గురువారం మధ్యాహ్నం  పేలుడు జరిగింది. ప్రభుత్వాసుపత్రిని ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనం ముందు డ్రైనేజీ వద్ద తిమ్మాపూర్ మండలం మొగిలి పాలెం గ్రామానికి చెందిన దుద్దెన దుర్గయ్య(70) పాత వస్తువులు ఏరుకుంటున్నాడు. మెడికల్ కాలేజీ మెయిన్ గేట్ వద్ద ఒక ప్లాస్టిక్ క్యాన్ కనిపించగా దానిని తీయడంతో అది ఒక్కసారిగా భారీశబ్దంతో పేలింది. ప్రమాదంలో దుర్గయ్యకు ముఖం, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి.

ఈ సమాచారంతో ఓఎస్డీ సుబ్బారాయుడు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పేలుడుకు అనుమానాస్పద పదార్థం ఉంచిన ప్లాస్టిక్ క్యాన్ చిన్న, చిన్న ముక్కలై సుమారు 300 మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి. దుర్గయ్య మురుగు కాల్వపై ఉండడంతో పేలుడు తీవ్రత కాల్వపై ఉన్న సిమెంట్ బిళ్లపై పడింది. విగ్రహాల తయారీలో వాడే రసాయనం వల్లే పేలుడు సంభవించిందని కరీంనగర్ డీఎస్పీ రామారావు పేర్కొన్నారు.

అయితే ఆ ప్రాంతంలో  విగ్రహాల తయారీ పరిశ్రమలేవీ లేవు. పేలుడు జరిగిన ప్రదేశంలో చెత్తాచెదా రం కూడా లేదు. మరి ఎందుకు క్యాన్ అక్కడ పడవేశారనేది తేలాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ పరిశీలించారు. ప్రజలు భయూం దోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్పీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు