ఆగిన ‘మైనర్’ పెళ్లి

3 Dec, 2015 00:04 IST|Sakshi

 పుల్‌కల్: మరికొద్ది సేపట్లో జరగాల్సిన ఓ బాల్య వివాహాన్ని ఎస్‌ఐ సత్యనారాయణతో పాటు సీడీపీఓ ఎల్లయ్య అడ్డుకున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఆందోళనకు గురయ్యారు. వివాహ వయస్సు వచ్చాకే పెళ్లి జరిపిస్తామని రాత పూర్వకంగా తెలపడంతో వ్యవహారం సద్దుమణిగింది. చౌటకూర్‌లో బుధవారం జరిగిన సంఘటన వివరాలు... పుల్‌కల్ మండల పరిధిలోని చౌటకూర్‌కు చెందిన ఆకుల కిష్టయ్య రెవెన్యూ శాఖలో ఉద్యోగి. తన మూడో కుమార్తెను ఇటిక్యాల్‌కు చెందిన మన్నే ఆంజనేయులకు ఇచ్చి వివాహం జరిపించేందుకు బుధవారం ముహూర్తం నిర్ణయించారు.
 
 చౌటకూర్ జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో పెళ్లిపందిరి సైతం సిద్ధం చేశారు. కాగా, పెళ్లికుమార్తెకు 18 సంవత్సరాలు నిండలేదని గుర్తుతెలియని వ్యక్తులు 1098కు సమాచారం అందించారు.
 
 దీంతో జోగిపేట ఐసీడీఎస్ సీడీపీఓ బాలయ్యతో పాటు పుల్‌కల్ ఎస్‌ఐ సత్యనారాయణ, ఆర్‌ఐ సుకుమారి.. వివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహాలు నేరమని, జరిపితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. దీంతో 18 ఏళ్లు నిండి న తర్వాతే పెళ్లిచేస్తామని వధూవరుల తరపు బంధువులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం పెళ్లికుమారుడు ఆంజనేయులుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీడీపీఓ బాలయ్య మాట్లాడుతూ.. ఇప్పుడు నిలిపిన పెళ్లిని తిరిగి ఎక్కడైనా జరిపితే వరుడితో పాటు సహకరించినవారిపైనా కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు