ఘాటెత్తుతున్న యార్డులు

15 Mar, 2019 15:34 IST|Sakshi
యార్డుల్లో పోటెత్తిన మిర్చి బస్తాలు

యార్డుల్లో పోటెత్తుతున్న బస్తాలు

ఎండలో రైతులకు తప్పని నిరీక్షణ

గంటల తరబడి మార్కెట్లో కాంటాలు

అపరిశుభ్రమైన యార్డులతో ఘాటు

సాక్షి, వరంగల్‌: మిర్చి సీజన్‌ ఊపందుకోవడంతో వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించేందుకు రైతులు భారీ మొత్తంలో తీసుకొస్తున్నారు. దీంతో యార్డులన్నీ ఘూటుతో పోటెత్తుతున్నాయి. గత వారం రోజులుగా 30వేల నుంచి 80వేల బస్తాల మిర్చిని రైతులు మార్కెట్లో విక్రయించారు. వేలాది బస్తాలు రావడంతో ఉన్న ఉద్యోగులతో కాంటాలు పెట్టించడం వల్ల రాత్రి వరకు సాగుతోంది. ఒక్కోసారి మరుసటి రోజున కాంటాలు పెడుతున్నారు. దీనికి తోడుగా ఎండలు ముదురుతుండటం వల్ల ఘాటు ఎక్కువ వస్తుండటంతో రైతులు యార్డుల్లో ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌కు వచ్చిన బస్తాల నుంచి షాంపిల్స్‌ తీయడం వల్ల కింద పడిన మిర్చి ధ్వసం కావడంతో ఈ ఘాటు మరింత ఎక్కువగా వస్తోంది. మిర్చి ఘాటు ప్రధాన రహదారి వరకు వస్తున్నదంటే ఎంత తీవ్రత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. 

ఎక్కువగా ‘తేజ’ రకమే...
మార్కెట్‌లో తేజ రకానికే డిమాండ్‌ ఉండటంతో రైతులు ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేశారు. వరంగల్‌ మార్కెట్‌కు బుధవారం సుమారు 60వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. ఇందులో తేజ రకం సగానికి పైగా వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మేలిరకం సరుకు రావడం వల్ల ధరలు గత మూడు రోజులుగా నిలకడగా ఉంటున్నాయని అంటున్నారు. ప్రస్తుతం తేజ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.6వేల నుంచి రూ.8వేలకు పైగా ధరతో కొనుగోలు చేస్తున్నారు.

అదేవిధంగా వండర్‌ హాట్, యుఎస్‌–341, సింగిల్‌పట్టి, డీడీ, సన్నాలు, 1048 లాంటి రకాలు మార్కెట్‌కు వస్తున్నాయి. మిర్చి రెండవ కోతలు ప్రారంభం జోరుగా సాగుతుండటంతో భారీగా సరుకు మార్కెట్‌కు వస్తోంది. మిర్చి నాణ్యతగా ఉన్నప్పటికీ భారీగా సరుకు వస్తున్నందున ధరలు కొన్నింటికే ఎక్కువగా ఇస్తూ మిగిలిన వాటికి అంతగా పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కాంటాలు జాప్యం..
మిర్చి యార్డుల్లో మార్కెట్‌లోని అన్ని యార్డులకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నా... కాంటాలు జాప్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కాంటాలు వేసే సమయానికి కమీషన్‌దారులు, కొనుగోలుదారులు లేకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. మిర్చి రాక ఎక్కువ కావడం, ఎండల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో యార్డుల్లో వస్తున్న మిర్చి ఘాటుకు రైతులు తల్లడిల్లిపోతున్నారు. యార్డుల్లోని రైతుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి నల్లాల్లో నీళ్లు వస్తున్నప్పటికీ ఆయా పరిసర స్రాంతాలు శుభ్రంగా ఉంచడంలో మార్కెట్‌ పారిశుధ్య సిబ్బంది విఫలమవుతున్నారు.

యార్డులను శుభ్రం చేస్తున్నాం
మిర్చి భారీగా వస్తున్నందున యార్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని శుభ్రం చేస్తున్నాం. మిర్చి ఘాటు రాకుండా నీళ్లు చల్లించాలంటే బస్తాలు అడ్డంకిగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి రోజు సాధ్యమైన మేరకు శుభ్రంగా ఉంచేందుకు  చర్యలు తీసుకుంటున్నాం.
– రాంమోహ్మన్‌రెడ్డి, గ్రేడ్‌–2 కార్యదర్శి

మరిన్ని వార్తలు