మిర్చి రైతుల్లో ధర.. దడ

13 May, 2020 12:40 IST|Sakshi
కోల్డ్‌ స్టోరేజీ నిండడంతో బయట ఉంచిన మిర్చి బస్తాలు (ఫైల్‌)

లాక్‌డౌన్‌తో వ్యవసాయ మార్కెట్లలో నిలిచిన క్రయ విక్రయాలు

దళారుల రంగప్రవేశంతో తగ్గిన రేటు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చికి మంచి ధర పలుకుతున్నప్పటికీ రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో వ్యవసాయ మార్కెట్లలో 50 రోజులుగా కొనుగోళ్లు నిలిచాయి. లావాదేవీలు స్తంభించడంతో రైతులు మిర్చి అమ్ముకునే పరిస్థితులు కనిపించక నష్టపోతున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు రైతుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లాలో కోల్డ్‌ స్టోరేజీలన్నీ మిర్చి నిల్వలతో నిండిపోవడంతో కొత్తగా తరలించే వీలు లేకుండాపోతోంది. జిల్లాలో ఈసారి 51,150 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు పండింది. మొత్తం 12.75 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొదట్లో మిర్చి క్వింటా రూ.18వేల నుంచి రూ.21వేల వరకు పలికింది. అనంతరం చైనాలో కరోనా వైరస్‌ ప్రభావంతో అంతర్జాతీయంగా ఎగుమతులు కొంతమేరకు తగ్గడంతో ధర పడిపోయింది. దీంతో రైతులు జిల్లాలోని  37 కోల్డ్‌ స్టోరేజీల్లో మిర్చిని నిల్వ చేసుకున్నారు. ఇంకా మార్కెట్లలో కొనుగోళ్లు లేకపోవడంతో కొందరు ప్రైవేట్‌ వ్యాపారులు దండుకుంటున్నారు.

క్వింటాకు రూ.9వేల నుంచి రూ.11వేలేనంట..
మిర్చికి రూ.15వేలు, రూ.16వేలు క్వింటా ధర పలుకుతున్న సమయంలోనే మార్చి 22వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయడంతో వ్యవసాయ మార్కెట్లను మూసివేశారు. రాష్ట్రంలో వరంగల్‌ మార్కెట్‌ తర్వాత మిర్చి క్రయ విక్రయాలు ఖమ్మం మార్కెట్‌లో ఎక్కువగా సాగుతాయి. ప్రతిరోజూ దాదాపు 25వేల బస్తాలొస్తాయి. అంటే సుమారు 10వేల క్వింటాళ్లన్నమాట. కొద్ది రోజులుగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ప్రైవేట్‌ వ్యాపారులకు మిర్చిని రైతులు అమ్ముకుంటున్నారు. వారు రూ.9వేల నుంచి రూ.11వేలకు మించి ధర పెట్టట్లేదు. ముదిగొండలో ఉన్న చైనాకు సంబంధించిన చెంగ్‌వాంగ్‌ మిల్లు వద్ద కూడా ఇదే పరిస్థితి. గ్రామాల్లో పోటీ లేకపోవడంతో వారు చెప్పిన ధరకే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో ప్రతి క్వింటాకు రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య రైతులు నష్టపోతున్నారు. ఆశలు నీరుగారిన వేళ ధరాఘాతం తప్పట్లేదు.

బాగా నష్టపోతున్నాం..
గ్రామాల్లో, గోదాముల వద్ద వ్యాపారులు మిర్చి కొనుగోలు చేస్తున్నారు. మిర్చికి డిమాండ్‌ ఉన్నా..వాళ్లేమో రేటు పెట్టడం లేదు. దీంతో క్వింటాకు వేలల్లో నష్టపోతున్నాం.– భూక్యా వీరన్న, రైతు, బాలాజీనగర్‌ తండా,తిరుమలాయపాలెం మండలం

నిర్వహణ నిలిచింది..
లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా మార్కెట్ల నిర్వహణ నిలిచిపోయింది. పంట కొనుగోళ్లను నిర్వహించలేకపోతున్నాం. గ్రామాల్లో, పలు అర్బన్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ పంట క్రయ విక్రయాలకు అవకాశం కల్పించాం.– కె.నాగరాజు, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా