రైతు కంట్లో కారం

31 Mar, 2017 03:00 IST|Sakshi
రైతు కంట్లో కారం

వారం కిందటితో పోల్చితే మిర్చి ధర 25% వరకు తగ్గించిన వ్యాపారులు
వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌యార్డులో రైతుల ఆందోళన
మిర్చి బస్తాలు దహనం చేసి నిరసన.. గేట్లకు తాళం వేసి ధర్నా
ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ నినాదాలు.. కోల్డ్‌ స్టోరేజీల ఏర్పాటుకు డిమాండ్‌
వారం కిందటా రైతుల ఆందోళన.. అయినా పట్టించుకోని మార్కెట్‌ పాలకవర్గం


వరంగల్‌ సిటీ
వ్యాపారుల తెంపరితనం, మార్కెట్‌యార్డు పాలకమండళ్ల ‘సహకారం’తో మిర్చి రైతుల కంట్లో మంట పుట్టిస్తోంది. కష్టపడి పండించి మార్కెట్‌కు తీసుకువస్తే తగిన ధర అందక రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. అటు పంటను అమ్ముకోలేక.. ఇటు నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజీలు లేక అవస్థలు పడుతున్నారు. చివరికి తాము పండించిన పంటనే తగలబెట్టేందుకూ సిద్ధమవుతున్నారు. వ్యాపారులు మిర్చి ధర తగ్గించి మోసం చేస్తున్నారంటూ గురువారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చిని దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులు కావాలనే ధర తగ్గిస్తున్నారని, అయినా పాలకవర్గం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మార్కెట్‌ ప్రధాన గేట్లకు తాళం వేసి, ధర్నా చేశారు. మిర్చి ధర తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదే మార్కెట్‌యార్డులో వారం కింద కూడా రైతులు మిర్చిని దహనం చేయడం గమనార్హం.

ధరలు తగ్గించిన వ్యాపారులు
ఉగాది పండుగ నేపథ్యంలో ఐదు రోజుల సెలవుల అనంతరం ఏనుమాముల మార్కెట్‌ గురువారం తిరిగి ప్రారంభమైంది. రైతులు సుమారు 50 వేల బస్తాలకుపైగా మిర్చిని అమ్మకానికి తీసుకువచ్చారు. కానీ వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేశారు. దేశీ రకం మిర్చి వారం క్రితం క్వింటాల్‌కు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకగా.. గురువారం రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకే పలికింది. సింగిల్‌పట్టీ రకం ధరను రూ.16 వేల నుంచి రూ.14 వేలకు తగ్గించారు. తేజా రకం మిర్చి అయితే వారం కింద రూ.6 వేలు పలకగా.. దాదాపు సగానికి తగ్గించి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకే కొనుగోలు చేశారు. మిగతా సాధారణ రకం మిర్చి ధరనూ తగ్గించారు. వారం క్రితం రూ.7,500 పలికిన సాధారణ రకం మిర్చి.. గురువారం గరిష్టంగా రూ.5 వేలు మాత్రమే పలికింది. అసలు గత సంవత్సరం అన్ని రకాల మిర్చి కూడా క్వింటాల్‌కు రూ.12 వేలకు పైనే పలికింది. నాణ్యమైన రకాలైతే రూ.18 వేల వరకు ధర రావడం గమనార్హం.

ఆవేదనతో ఆందోళన
మిర్చి ధరలు తగ్గించడంతో రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. వ్యాపారులు కావాలనే ధర తగ్గిస్తున్నా పాలకవర్గం పట్టించుకోవడం లేదంటూ వారు ఆందోళనకు దిగారు. మార్కెట్‌ కార్యాలయం వద్దకు చేరుకుని చైర్మన్‌ బయటకు రావాలని నినాదాలు చేశారు. ఒక మిర్చి బస్తాను మార్కెట్‌ దారిలో వేసి దహనం చేసి నిరసన తెలిపారు. మార్కెట్‌ ప్రధాన గేట్లకు తాళం వేసి ధర్నాకు దిగారు. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు.. మార్కెట్‌ వద్దకు చేరుకుని, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళన విరమించాలంటూ రైతులను శాంతిపజేశారు.

ఏసీ గోదాములు నిర్మించాలి
మంత్రి హరీశ్‌రావుకు చిత్తశుద్ధి ఉంటే అక్కరకు రాని గోదాములు కాకుండా.. మిర్చి ధర తక్కువగా ఉన్నప్పుడు నిల్వ చేసుకునేలా ఏసీ గోదాములు (కోల్డ్‌ స్టోరేజీలు) నిర్మించాలని పలువురు రైతులు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో మిర్చి ధరలు సగానికి సగం పడిపోయాయని... నిల్వ చేసుకుందామంటే కోల్డ్‌ స్టోరేజీల సదుపాయం లేదని మండిపడ్డారు. ప్రైవేట్‌ కోల్డ్‌ స్టోరేజీలు కేవలం వ్యాపారులకే అవకాశం ఇస్తుండడంతో రైతులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. దాంతో అటు పంటను అమ్ముకోలేక, ఇటు దాచుకునే సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నామని.. తమకు ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సాయంత్రానికి ఏనుమాముల మార్కెట్‌లో రైతుల ఆందోళన తగ్గినా.. మార్కెట్‌ నిండా అమ్మకానికి వచ్చిన మిర్చి బస్తాలు, వాటి వద్ద కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తూ కూర్చున్న రైతులు కనిపించారు. కొందరు రైతులు మాత్రం తక్కువ ధరకే మిర్చిని అమ్ముకుని వెళ్లిపోయారు.

– గతేడాది సాధారణ రకాల మిర్చి క్వింటాల్‌కు రూ.12వేలకు పైనే పలికింది. నాణ్యమైన రకాలకు రూ.18 వేల వరకు ధర వచ్చింది.

‘నామ్‌’తో నష్టపోతున్నాం: పసుపు రైతులు
ఏనుమాముల మార్కెట్‌ పసుపు యార్డులో ప్రవేశపెట్టిన నామ్‌ (జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధానం)తో నష్టపోతున్నామని వ్యాపారులు, అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. కళ్లకు గంతలు కట్టి బేరం చేయడాన్ని మానుకోవాలని డిమాండ్‌ చేశారు. గురువారం పలువురు రైతులు మార్కెట్‌కు పసుపు పంటను తీసుకొచ్చారు. అయితే ‘నామ్‌’లో భాగంగా సీక్రెట్‌ బిడ్డింగ్‌తో తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

మేలు రకం (కాడి) కంటే నాసిరకం (గోల) పసుపుకే ఎక్కువ ధర కోట్‌ చేస్తున్నారని.. తల్లి, పిల్ల పసుపునకు ఒకే ధర పలికితే నామ్‌తో ఏం లాభమని నిలదీశారు. కళ్ల ముందు సరుకు చూస్తూ నాణ్యత ప్రకారం కొనుగోలు చేసే ఓపెన్‌ టెండర్‌ విధానాన్నే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో రైతులకు మంచి ధర రావాలనే ప్రభుత్వం ‘నామ్‌’ను అమలు చేస్తోందని మార్కెట్‌ చైర్మన్‌ కొంపెల్లి ధర్మరాజు వివరించగా.. రైతులు అంగీకరించలేదు. ‘నామ్‌’అమలు చేయాలనుకుంటే మార్కెట్‌ యార్డులో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి.. దేశంలోని ఏయే మార్కెట్‌లో పసుపు ధర ఎంత పలికిందో తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు