హామీ ఏమాయే..? 

23 Jan, 2019 14:25 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మొదటి హామీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. కేవలం కాగితాలకే పరిమితమైంది. రూరల్‌ జిల్లా వ్యవసాయాధారిత జిల్లాగా పేరొందింది. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక జిల్లాలో ఉన్న పరిస్థితి, వనరుల గురించి జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎం నివేదికలను కోరారు. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరకాల నియోజకవర్గం గూడెప్పాడ్‌లో పెద్ద కురగాయల మార్కెట్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. స్థల పరిశీలన చేయాలని ఆదేశించారు. అలాగే నర్సంపేట ప్రాంతంతో మిర్చి రీసెర్చ్‌ సెంటర్‌ చేస్తానని తొలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

ఇంతవరకూ ఊసేలేదు..
జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని గూడెప్పాడ్‌లో కూరగాయలు రైతులు బాగా పండిస్తారు. గూడెప్పాడ్‌ వ్యవసాయ మార్కెట్‌ ఐదెకరాల విస్తీర్ణంలో ఉంది. మరో ఐదెకరాల భూమిని ఆ మార్కెట్‌కు పక్కనే కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నర్సంపేట పరిసర ప్రాంతాలు, మహబూబాబాద్‌ జిల్లాలో మిర్చి పంట పండిస్తారు. ఈ మేరకు అధికారులు గూడెప్పాడ్‌లో కూరగాయల మార్కెట్, నర్సంపేటలో మిర్చి సెంటర్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.. ప్రకటించి దాదాపు రెండేళ్లయినా ఇంతవరకు ముందుకు జరగడం లేదు.

మూడు జిల్లాలకు అనువైన ప్రాంతం..
హైదారాబాద్‌ తరువాత వరంగల్‌ పెద్ద నగరంగా గుర్తింపు ఉంది. నగరంలో పెద్ద మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు స్థలం కొరత ఉంది. నగరానికి దాదాపు 14 కిలో మీటర్ల దూరంలోనే గూడెప్పాడ్‌ ఉండడంతో ఎంపిక అనువైందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మూడు జిల్లాలకు అనువైన ప్రాంతంగా గూడెప్పాడ్‌ ఉంది. వరంగల్‌ అర్బన్, రూరల్, భూపాలపల్లి జిల్లాలకు మధ్యలో ఉంటుంది. మార్కెట్‌ ఏర్పాటు చేస్తే అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక్కడ పండి ంచే రైతులతో పాటు ఇతర ప్రాంతాలకు ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా కూరగాయలు తరలించవచ్చనే ఆలోచనతో అధికారులు ప్రతిపాదనలు పంపారు.

స్థల సేకరణ..
తెలంగాణలో పత్తి, మిర్చి రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థల సేకరణతో సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత నిధులు మంజూరు బాధ్యత కేంద్రానిది. పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో స్థల సేకరణ విషయంలో అడుగు ముందుకు పడలేదు.

మరోవైపు మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు దాదాపు వంద ఎకరాలకు పైగా స్థలం అససరం అవుతుంది. దీని కోసం వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట సమీపంలో అశోక్‌ నగర్‌ వద్ద సర్వే నంబరు 265/ఏలో 90 ఎకరాల స్థలాన్ని రెవెన్యూశాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్పందన లేదు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీనే అమలు కాకపోవడంతో సర్వత్రా చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. 

మరిన్ని వార్తలు