అయ్యో రైతన్నా..బె‘ధరా’ల్సిందేనా!

17 Sep, 2018 07:35 IST|Sakshi

మధిర(ఖమ్మం): ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటకు మంచి ధర వస్తుందని కొన్ని నెలలుగా కోల్డ్‌ స్టోరేజీల్లో సరుకు నిల్వ చేసిన రైతులు బెదిరిపోయేలా, గుండెధైర్యం చెడేలా ఇంకా రేటు పతనమవుతోంది. గత ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన మిర్చి పంటలో చాలా వరకు నిల్వ చేశారు. అప్పుడు క్వింటా ధర రూ.9,500 పలికింది. అయితే పెట్టుబడి భారం పెరగడంతో ఆ రేటుతో గిట్టుబాటు కాదని ఎక్కువమంది సాగుదారులు మిర్చిని శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ నడుస్తున్న తరుణంలో వ్యవసాయ పెట్టుబడి అవసరాల రీత్యా..అప్పటి మిర్చిని అమ్ముకోవాలనుకుని మార్కెట్‌కు తెస్తుండగా డిమాండ్‌ ఉండట్లేదు. ప్రస్తుతం క్వింటాకు రూ.8,500 మాత్రమే రేటు పలుకుతోంది.

అంటే..ఏడాది పాటు నిల్వ ఉంచితే..ఉన్న రేటు కూడా పడకపోగా క్వింటాకు వెయ్యి రూపాయల చొప్పున దిగజారడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. తేజ సన్నరకం మిర్చిని 70శాతం కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచితే..క్వింటాకు ఆరు నెలలకు రూ.350 చొప్పున కట్టాలి. చాలామంది రైతులు..30 క్వింటాళ్ల వరకు సరుకును నిల్వ ఉంచారు. దీంతో వీరికి వేలాది రూపాయల భారం పడింది. ఇంటి నుంచి మిర్చిని శీతల గిడ్డంగి వరకు తరలించేందుకు ఎగుమతి, అక్కడ దిగుమతి, ఇతర రవాణా ఖర్చులు..కలిపి తడిసి మోపెడయ్యాయి. పైగా..వీటి ధర పెరుగుతుందనే ఆశతో, ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ కోసం వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నారు. అంతకుముందు సంవత్సరం మిర్చి నిల్వ చేసినప్పుడు రైతులకు కలిసివచ్చింది. క్వింటాకు రూ.2వేలకు పైగానే పెరిగింది. కానీ..ఈసారి అసలు డబ్బులు కూడా రాని దైన్యం నెలకొనడంతో ఏం చేయాలో తెలియక అమ్మాలంటేనే..బెదిరిపోతున్నారు.

రైతుల పరిస్థితి ఆగమాగం.. 
మార్కెట్‌లో క్వింటా ఒక్కింటికి తేజ రకాలను రూ.8,500లకు వ్యాపారులు అడుగుతున్నారు. లావు రకాలను అడిగే నాథుడే లేడు. సుమారు 6నెలలు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉంచి, అద్దెలు చెల్లించి, వడ్డీలు పెరిగి అప్పు తడిచిమోపెడవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటా ఒక్కింటికి వెయ్యిరూపాయలు ధర తగ్గడంతోపాటు మరో వెయ్యిరూపాయల వరకు ఖర్చులు, వడ్డీలు అవుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, చైనా, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి ఆర్డర్లు లేకపోవడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో 32 కోల్డ్‌స్టోరేజీలు ఉండగా వాటిల్లో సుమారు 20లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉన్నాయి.

మరికొంతమంది చిన్నచిన్న వ్యాపారులు ధర పెరుగుతుందని కల్లాల్లో కొనుగోలుచేసి కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వచేయగా..వీరికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాకుండా కోల్డ్‌స్టోరేజీలో సాంకేతిక సమస్య ఏర్పడినా, మిర్చి నిల్వ చేసినప్పుడు కొద్దిగా తేమ ఉన్నా నాణ్యత తగ్గిపోయి ధర మరింత క్షీణిస్తుంది. ప్రస్తుతం వివిధ రకాల పంటలు పలు దశల్లో ఉన్నాయి. వీటికి పెట్టుబడి పెట్టేందుకు రైతులకు డబ్బులు అవసరమవుతున్నాయి. అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చిన  రైతులకు వ్యాపారులు అడిగే రేటు వింటే కళ్లల్లో కన్నీరు తిరుగుతోంది.

లావు రకాలపై చిన్నచూపు.. 
లావు రకాలైన 334, 275 తదితరాల మిర్చికి డిమాండ్‌ ఉండట్లేదు. గత ఖరీఫ్‌ సీజన్‌లో రూ.9000 ధర పలకగా..ఇప్పుడు 7,500కు పడిపోయింది. క్వింటాకు రూ.1500 తగ్గిపోవడంతో ఈ సరుకును అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది.

క్వింటాకు రూ.2వేల నష్టం.. 
ధర పెరుగుతుందని కోల్డ్‌ స్టోరేజీలో మిర్చిని నిల్వ ఉంచితే..ఇప్పుడు క్వింటాకు రూ.2వేల నష్టం వస్తోంది. మిరపనారుకు, కూలీలకు, అరకలు, ఎరువులు, పురుగుమందుల పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. కానీ మద్దతు ధర మాత్రం పెంచట్లేదు. 61బస్తాలు మే నెలలో కోల్డ్‌స్టోరేజీలో నిల్వ ఉంచా. ఆరోజు కల్లంలో రూ.9వేలకు అడిగారు. కానీ ఇప్పుడు రూ.8,500 అంటున్నారు. నెలనెలా రేటు తగ్గుతోంది.  – గూడూరు ప్రభాకర్‌రెడ్డి, పెద్దకోరుకొండి, కల్లూరు మండలం

పెట్టుబడికి డబ్బుల్లేవు.. 
ప్రస్తుతం పత్తి, మిర్చి పంటలు సాగుచేశా. వాటికి పెట్టుబడి పెట్టేందుకు చేతిలో డబ్బులు లేవు. కోల్డ్‌స్టోరేజీలో నిల్వ ఉన్న మిరప బస్తాలను అమ్ముకునేందుకు యార్డుకు వచ్చిన. లావు రకం మిర్చి కావడంతో ఎవరూ కొనట్లేదు. రైతు పరిస్థితి దిగజారుతోంది. ఇదేవిధంగా కొనసాగితే వ్యవసాయం చేయడం కష్టమే అవుతుంది. మా బాధలను పట్టించుకునే వారు కరువయ్యారు.   – బండి సుబ్బారావు, దేశినేనిపాలెం, మధిర మండలం

మరిన్ని వార్తలు