గంగోత్రిలో మిర్యాలగూడవాసి మృతి

14 Oct, 2017 01:41 IST|Sakshi

ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన నరహరి

డెహ్రాడూన్‌లో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతున్న విద్యార్థి

మిర్యాలగూడ టౌన్‌: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్‌బోర్డుకు చెందిన బొమ్మిడి నరహరి(22) ఉత్తరకాశీ లోని గంగోత్రి నదిలో పడి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పాలేరు సమీపంలోని నాయ కన్‌ గూడేనికి చెందిన బొమ్మిడి మల్లయ్య బతుకుదెరువు నిమిత్తం కుటుంబ సభ్యు లతో కలసి మిర్యాలగూడకు వచ్చాడు. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో గల రాంరెడ్డి పార్కు సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు.

అతని కుమారుడు నరహరి డెహ్రాడూన్‌లోని డీఎస్‌బీ వర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతూ.. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా నరహరి ఉత్తరకాశీలోని గంగోత్రి విహార యాత్రకు వెళ్లాడు. దైవ దర్శనం నిమిత్తం పక్కనే ఉన్న నదిలోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాద వశాత్తు కాలుజారి నదిలో పడి మృతి చెందాడు. మృత దేహాన్ని వెలికితీశారు. విషయం తెలుసుకున్న నరహరి కుటుంబ సభ్యులు ఉత్తరకాశీకి బయలుదేరి వెళ్లారు.

కొడుకును అధికారిగా చూడాలని..
మల్లయ్య.. ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని విజయ ఆగ్రో కెమికల్స్‌ డీలర్‌గా పనిచేస్తున్నాడు. నరహరి చిన్నప్పటి నుంచి చదువులో మేటి. మల్లయ్యకు తన కొడుకును అగ్రికల్చర్‌ అధికారిగా చూడాలన్న కోరికతోనే డెహ్రాడూన్‌కు పంపించాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అవుతాడని అనుకోలేదంటూ నరహరి తల్లిదండ్రులు మల్లయ్య, లక్ష్మి, సోదరి సారికలు కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు