భయపడితే ప్రణయ్‌కు నచ్చదు : అమృత

19 Sep, 2018 12:17 IST|Sakshi
అమృత - ప్రణయ్‌ (ఫైల్‌ ఫోటో)

మిర్యాలగూడ : ‘ఎక్కువ కులం ఏంటి.. తక్కువ కులం ఏంటి.. అసలు ఈ కులం అనేదాన్నే తొలగించాలి.. మన పిల్లల్ని మాత్రం ఈ కులం రొంపిలో పడకుండా బాధ్యాతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుదాం’.. ఇది ప్రణయ్‌ కల. ‘రిసెప్షన్‌కు ముందు రెండు రోజులు మేం వేర్వేరు గదుల్లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో మా భవిష్యత్తుకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఆ రెండు రోజులే రెండు యుగాలుగా అన్పించాయి. ఇప్పుడు నా పూర్తి జీవితం ప్రణయ్‌ లేకుండా గడపాలి. ఇది నాకు సాధ్యమవుతుందా..’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తోంది అమృత. రెండు రోజులు ఒకరికి ఒకరు కనిపించకపోతేనే తట్టుకోలేని ఆ పసి హృదయాలు ఇప్పుడు జీవిత కాలం ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి. ‘పరువు’ అనే కనిపించని భూతం వారి నూరేళ్ల జీవితాన్ని మింగేసింది. ఇది నల్గొండ, మిర్యాలగూడలో జరిగిన విషాదాంత ప్రేమకథ చిత్రమ్‌.

వైశ్య కులానికి చెందిన తిరునగరి అమృత వర్షిణిని పెళ్లాడటమే ప్రణయ్‌ చేసిన పాపం. కక్ష్య గట్టిన అమృత తండ్రి మారుతీరావ్‌ ప్రణయ్‌ని అతి కిరాతకంగా హత్య చేయించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. తన భర్తను చంపిన తండ్రికి ఉరి శిక్ష పడాలని అమృత కోరుకుంటోంది. తాను తన పుట్టింటికి వెళ్లేది లేదని.. అత్తింట్లోనే ఉండి కుల రహిత సమాజం కోసం పోరాటం చేస్తానంటోంది. ఈ సందర్భంగా అమృత చెప్పిన అంశాలు... ‘ప్రణయ్‌కు మొదటి నుంచి కులం అంటే నచ్చేది కాదు. కుల రహిత సమాజం కోసం కలలు కనేవాడు. ఈ విషయం గురించి అనేక సార్లు నాతో చర్చించేవాడు. కానీ మా ప్రేమ నా తల్లిదండ్రులకు నచ్చలేదు. కారణం ప్రణయ్‌ది తక్కువ కులం కావడం. ఈ కులాల పిచ్చి మా నాన్న లాంటి సైకోలకే కానీ మాకు కాదు. అందుకే ఇంట్లోంచి వెళ్లి పోయి వివాహం చేసుకున్నాం. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. మా బిడ్డ గురించి మేము ఎన్నో కలలు కన్నాం. మా బిడ్డను ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మంచి పౌరులుగా తీర్చి దిద్దుకోవాలని ఆశపడ్డాం’ అని తెలిపింది.

అమృత మాట్లాడుతూ ‘ఇక్కడే ఉంటూ పాలీ హౌస్‌ ఏర్పాటు చేయాలనుకున్నాం. విదేశాలకు కూడా వెళ్లాలనుకున్నాం. మా కుటుంబ పరిస్థితుల వల్ల మేం చాలా త్వరగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఇప్పుడు 21 ఏళ్లు.. ప్రణయ్‌కి 24 ఏళ్లు. మా జీవితం ఇప్పుడే ప్రారంభమయ్యింది. ప్రపంచంలోని అన్ని సంతోషాలను పూర్తిగా అనుభవించాలనుకున్నాం. కానీ కులం మా కలల్ని చిధిమేసింది. నా ‍ప్రణయ్‌ని నా నుంచి దూరం చేసింది. నన్ను, నా బిడ్డను ఒంటరి వాళ్లను చేసింది. కానీ నేను భయపడను. భయపడితే ప్రణయ్‌కు నచ్చదు. మా ప్రేమకు ప్రతిరూపమైన మా బిడ్డను ప్రణయ్‌ ఆశాయాలకు అనుగుణంగా, కుల పిచ్చికి వ్యతిరేకంగా నేనే పెంచుతాను’ అంటూ వివరించింది.

అంతేకాక ‘మా అత్త మామలకు తోడుగా ఇక్కడే ఉంటాను. నా పుట్టింటికి వెళ్లను. ప్రణయ్‌ని చంపిన వారికి శిక్ష పడేంత వరకూ నా పోరటాన్ని కొనసాగిస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. అమృత మామా గారు బాలాస్వామీ మాట్లాడుతూ.. ‘వీరిద్దరి ప్రేమ గురించి మాకు చెప్పినప్పుడు మేం వద్దని వారించాం. ఇలాంటి ప్రమాదాలు వస్తాయని ముందే హెచ్చరించాం. కానీ వారు తమ జీవితం గురించి, ప్రేమ గురించి చాలా నిజాయితీగా, బలంగా ఉన్నారు. ఇక చేసేదేం లేక వివాహనికి ఒప్పుకున్నాం. వారిద్దరూ ఎందో అన్యోనంగా ఉండేవారు. కానీ మేం ఊహించిందే జరిగింది. కులం మా అబ్బాయిని కాటేసింది. అమృత తన పుట్టింటికి వెళ్లనంటోంది. తనను మా దగ్గరే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటాం’ అని తెలిపారు.

ఈ హత్య గురించి పోలీసు ఉన్నతాధికారి ఒకరు ప్రణయ్‌ - అమృతల వెడ్డింగ్‌ రిసెప్షన్‌ వీడియో అమృత నాన్నలో కోపాన్ని తీవ్రంగా పెంచింది. కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే కాక తమ వివాహ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం.. వాటిని తన బంధువులు కూడా చూడటం వల్ల ఆయనకు తీవ్రమైన కోపం వచ్చింది. అందువల్ల ప్రణయ్‌ని అడ్డుతొలగిస్తే.. తన కూతురు తన దగ్గరకు వస్తుందని భావించాడు. అందుకే ఈ నేరానికి పాల్పడినట్లుగా మారుతీ రావ్‌ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు