శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

19 Oct, 2014 00:10 IST|Sakshi
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌

శంకర్‌పల్లి: పుణే నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు శంకర్‌పల్లి రైల్వేస్టేషన్ వద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం బొగ్గులోడుతో గూడ్స్ రైలు వికారాబాద్ వైపు వెళ్తుండగా అందులోని ఓ వ్యాగన్‌లో సమస్య తలెత్తింది.  

దీంతో దాన్ని శంకర్‌పల్లిలోని ప్లాట్‌ఫాంపై నిలిపేశారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ నుంచి 13 మంది సిబ్బంది ఓ మినీ రైలులో వచ్చి వ్యాగన్‌కు మరమ్మతులు చేస్తున్నారు. శంకర్‌పల్లి రైల్వేస్టేషన్ నాలుగు లైన్ల పట్టాలున్నాయి. నాలుగో నంబర్ పట్టాపై చెడిపోయిన వ్యాగన్, మూడో నంబర్ పట్టాపై సిబ్బంది వచ్చిన రైలు ఉన్నాయి. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు రెండో నంబర్ పట్టాలపై నుంచి వె ళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

శంకర్‌పల్లి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే మరమ్మతులు చేయడానికి వచ్చిన రైలు క్రేన్ కొనభాగం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు తగలడంతో సుమారు 3 ఏసీ బోగీల అద్దాలు పగిలిపోయాయి. ఆ సమయంలో రైలు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఉంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ అప్రమత్తమై రైలును కంట్రోల్‌చేసి నిలిపేశారు. ప్రయాణికులెవరూ గాయపడలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని మరమ్మతు చేస్తున్న సిబ్బంది తెలిపారు. ఇరవై నిమిషాల తరువాత రైలు సికింద్రాబాద్ వెళ్లింది.

మరిన్ని వార్తలు