సైబర్‌ క్రైమ్‌ ఠాణాను సందర్శించిన మిలన్‌ ప్రీత్‌ కౌర్‌

8 Jun, 2019 07:33 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘మిసెస్‌ ఇండియా పంజాబ్‌–2019’ మిలన్‌ ప్రీత్‌ కౌర్‌ శుక్రవారం నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌ను సందర్శించారు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌తో దాదాపు గంటకు పైగా సమావేశమైన ఆమె ఇటీవల సైబర్‌క్రైమ్స్‌లో వస్తున్న మార్పులు, ఐటీ విభాగంలో విధులు నిర్వర్తించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలను తెలుసుకున్నారు. చంఢీగడ్‌కు చెందిన మిలన్‌ భారత వాయుసేనలో స్వాడ్రన్‌ లీడర్‌గా పని చేస్తున్నారు. వడోదరలో విధులు నిర్వర్తిస్తూ చంఢీగడ్‌లో ఈ నెల 12న జరిగిన ‘మిసెస్‌ ఇండియా పంజాబ్‌’ పోటీల్లో పాల్గొని కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె ఇటీవలే బేగంపేటలోని ఎయిర్‌పోర్స్‌ బేస్‌కు బదిలీ అయ్యారు. ప్రధానంగా ఇన్ఫర్నేషన్‌ టెక్నాలజీ (ఐటీ) వింగ్‌ను పర్యవేక్షిస్తున్న కౌర్‌ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేసిన, ఛేదించిన కేసుల వివరాలు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మీడియా ద్వారా తెలుసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తుండటంతో నేరుగా వచ్చి అదనపు డీసీపీతో అనేక అంశాలపై చర్చించారు. 

మరిన్ని వార్తలు