శభాష్‌.. విజయ్‌నాయక్‌

18 Oct, 2019 14:06 IST|Sakshi
కానిస్టేబుల్‌ విజయ్‌నాయక్‌తో వృద్ధుడు, అతడి కుమారుడు

గూగుల్‌ ట్రాన్స్ లేటర్‌తో వృద్ధుడిని కుటుంబీకులకు అప్పగించిన కానిస్టేబుల్‌  

రాజేంద్రనగర్‌: తప్పిపోయి తిరుగుతున్న వృద్ధుడిని ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గూగుల్‌ ట్రాన్స్ లేటర్‌ సాయంతో పట్టుకొని కుటుంబీకులకు అప్పగించారు. వివరాలు.. శంషాబాద్‌ నర్కూడ ప్రాంతానికి చెందిన విజయ్‌నాయక్‌ రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. రెండు వారాల క్రితం ఠాణా పరిధిలోని ఆరాంఘర్‌ చౌరస్తా వద్ద ఓ వృద్ధుడు రోడ్డుపై అటూఇటూ తిరుగుతూ కనిపించాడు. దీంతో అతడిని దగ్గరకు పిలిచి రోడ్డుపై తిరిగితే ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. అతడికి తెలుగు అర్థంకాకపోవడంతో నవ్వుతూ అలాగే రోడ్డుపై తచ్చాడసాగాడు. దీంతో విజయ్‌నాయక్‌ అతడిని కూర్చోబెట్టి టీ, బిస్కెట్‌ ఇచ్చారు. వివరాలు అడిగానా వృద్ధుడి నుంచి సమాధానం రాలేదు. అనంతరం కానిస్టేబుల్‌ తన విధులు ముగియడంతో వెళ్లిపోయారు. మరుసటి రోజు కూడా విజయ్‌నాయక్‌ అక్కడ విధులు నిర్వహిస్తుండగా వృద్ధుడు అతడి వద్దకు వచ్చాడు. టీ, బిస్కెట్‌ ఇవ్వాలని సైగలద్వారా చెప్పడంతో ఇచ్చారు. ఇలా వారంరోజుల పాటు ఇలా జరిగింది. వృద్ధుడి నుంచి వివరాలు రాబట్టే యత్నం చేసినా ఫలితం లేదు.

ఈనెల 12న తిరిగి వృద్ధుడు ఆరాంఘర్‌ చౌరస్తాకు రావడంతో విజయ్‌నాయక్‌ దగ్గరికి పిలిచాడు. తన సెల్‌ఫోన్ లోని గూగుల్‌ ట్రాన్స్ లేటర్‌ తో వృద్ధుడి మాటలను తెలుగులో అనువధించారు. వృద్ధుడు తాను తప్పిపోయానని.. ఇంటికి పంపించమని ?ప్రాధేయపడ్డాడు. అతడి నుంచి వివరాలు రాబట్టగా.. తన పేరు మధన్ మాలిక్‌ అని, వెస్ట్‌బెంగాల్‌ హౌరా రూరల్‌ జిల్లా రోజా గ్రామమని తెలిపాడు. నాలుగు నెలల క్రితం మరో ఆరుమందితో కలిసి వడ్రంగి పని చేసేందుకు వచ్చానని తెలిపాడు. తనను ఎలాగైనా ఇంటికి పంపించాలని వేడుకున్నాడు. వెంటనే కానిస్టేబుల్‌ సంబంధిత వివరాలను గూగుల్‌లో సెర్చ్‌ చేయగా వృద్ధుడి గ్రామం ఉదయ్‌నారాయణపూర్‌ ఠాణా పరిధిలో ఉందని గుర్తించారు.

సదరు ఠాణా నంబర్‌ను సేకరించి అదేరోజు అక్కడి పోలీసులతో మాట్లాడి విషయాన్ని వివరించారు. వృద్ధుడితో పోలీసులు మాట్లాడి వివరాలు తీసుకొని కుటుంబీకులకు తెలిపారు. వృద్ధుడి కుటుంబీకులు అదే పోలీస్‌స్టేషన్ లో 2019 జూన్ 19న మిస్సింగ్‌ కేసు పెట్టారు. 13నవారు ఉదయ్‌నారాయణ్‌పూర్‌ ఠాణాకు చేరుకున్నారు. వీడియో కాల్‌ చేయడంతో వృద్ధుడు తన కుటుంబీకులను గుర్తించాడు. తాము రాజేంద్రనగర్‌ వస్తున్నామని, అప్పటి వరకు వృద్ధుడిని సంరక్షణ చూసుకోవాలని వారు కానిస్టేబుల్‌ను కోరడంతో ఆయన విషయాన్ని రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ ప్రసాద్‌తో పాటు లా ఆండ్‌ ఆర్డర్‌ ఇన్ స్పెక్టర్‌ సురేష్‌కు వివరించారు. బుధవారం రాత్రి అక్కడి పోలీసులు, మధన్ మాలిక్‌ కుమారుడు రాజేంద్రనగర్‌ ఠాణాకు చేరుకున్నారు. వృద్ధుడికి సంబంధించిన పత్రలు చూపించడంతో వారికి అప్పగించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ విజయ్‌నాయక్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.

మరిన్ని వార్తలు