తప్పిపోతున్నారు..   

27 Aug, 2018 15:07 IST|Sakshi
అయాన్‌ను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు(ఫైల్‌) 

పక్షం వ్యవధిలో ఇద్దరు చిన్నారులు

అదృష్టవశాత్తు దొరికారు

నాలుగునెలల క్రితం  అదృశ్యమైన గణేష్‌

ఇప్పటికీ ఆచూకీ లేదు

నిర్లక్ష్యం పనికిరాదంటున్న పోలీసులు

కామారెడ్డి క్రైం : ముక్కుపచ్చలారని చిన్నారులు.. ఆడుకోవడమే వారికి సరదా. తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లడమంటే మరీ ఇష్టం. ఆడుకుంటున్నా, తోడుగా వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిని విస్మరిస్తే అంతే సంగతులు. ఇంటిల్లిపాదిని సంతోషాల్లో ముంచెత్తే బోసి నవ్వులు కనిపించకుండా పోతాయి! తలిదండ్రులు, కుటుంబసభ్యులు చేస్తున్న కొన్ని పొరపాట్లు పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇంటా బయటా, ఎక్కడున్నా చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతను ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు గుర్తుచేస్తున్నాయి. పిల్లల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా భారీ మూల్యం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులు తప్పిపోయిన సంఘటనలే ఇందుకు నిదర్శనం.  

పక్షం వ్యవధిలో ఇద్దరు చిన్నారులు.. 

జిల్లా కేంద్రంలో పదిహేను రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. వారిలో ఓ బాలుడు ఏకంగా కిడ్నాప్‌నకు గురయ్యాడు. అజాంపుర కాలనీకి చెందిన ఫాతిమా తన ఏడేళ్ల కుమారుడు సయ్యద్‌ అయాన్‌తో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలోని ఆమె వెళ్లగా బాలుడు బయట ఆడుకుంటున్నాడు. బాలుడిపై కన్నేసిన నజీరొద్దిన్‌ అనే వ్యక్తి అయాన్‌ను కిడ్నాప్‌ చేసి ఆటోలో వెళ్లిపోయాడు. బయటకు వచ్చిన తల్లి బాలుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. 

ఐదున్నర గంటలపాటు గాలించి నసీరొద్దిన్‌ ఇంట్లో బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మరో బాలుడు అదృశ్యం కావడం కలకలం రేపింది. దోమకొండ మండలం సంగమేశ్వర్‌ గ్రామానికి చెందిన లక్ష్మీపతి దంపతులు ఆస్పత్రి పనిమీద కామారెడ్డికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. పాతబస్టాండ్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకునేందుకు లోనికి వెళ్లారు. వారి కుమారుడు ఆరేళ్ల కృష్ణమూర్తి ఆస్పత్రి వరండాలో ఆడుకుంటూ తప్పిపోయాడు.

అరగంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు, పోలీసులు చుట్టు పక్కల అంతటా గాలించి ఓ మెడికల్‌ వద్ద బాలుడిని గుర్తించారు. అయాన్, కృష్ణమూర్తి అనే ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడంలో వారి తల్లిదండ్రుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో చేసిన పొరపాట్లే కారణమని పోలీసులు, స్థానికులు భావించారు. ఇవేకాకుండా గత డిసెంబర్‌లో పాత బాన్సువాడకు చెందిన లోకేష్‌ అనే ఐదేళ్ల బాలుడు తప్పిపోగా చిల్లర్గి గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఆ బాలుడిని తీసుకెళ్లిపోయారు. అప్పట్లో ఈ సంఘటన కలకలం రేపింది. చివరికి పోలీసులు కేసును చేధించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

అంతకుముందు కోటగిరికి చెందిన ఓ బాలుడిని కిడ్నాపర్లు ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులు కేసు ఛేదించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. మొన్నటికి మొన్న నందిపేట మండలం వన్నెల్‌(కే) గ్రామానికి చెందిన ఆరేళ్ల పాప మనీశ్వరిని మరో మహిళ పాఠశాల నుంచి కిడ్నాప్‌ చేయగా కేరళలో వారిని గుర్తించిన విషయం తెలిసిందే.

ఇప్పటికీ దొరకని గణేష్‌ ఆచూకీ..  

కామారెడ్డిలోని భరత్‌నగ ర్‌ కాలనీకి చెందిన మూ డేళ్ల వయస్సు గల కటికె గణేష్‌ ఇంటి ముందు ఆడుకుంటుండగా తల్లిదండ్రులు బయటకు వచ్చి చూసే సరికి తప్పిపోయాడు. ఏప్రిల్‌లో జరిగిన బాలుడి అదృశ్యం కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గణేష్‌ ఆచూకీ కోసం పట్టణంతో పాటు జిల్లా అంతటా వడపోశారు. అయినా లభించలేదు. బాలుడిని ఎవరో కిడ్నాప్‌ చేసి ఉంటారని అందరూ భావించారు. గణేష్‌ తప్పిపోయి నాలుగు నెలలు దాటినా ఇప్పటికి అతడి జాడ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం కూడా అతడి ఆచూకీ తెలియకపోవడానికి కారణమైంది.

మరిన్ని వార్తలు