సంజీవ్‌ శవమయ్యాడు

18 Apr, 2020 11:44 IST|Sakshi
కొడెం సంజీవ్‌(ఫైల్‌), మృతదేహాన్ని గనిపైకి తీసుకువస్తున్న సిబ్బంది

సంజీవ్‌ శవమయ్యాడు

11రోజులకు మృతదేహం లభ్యం

మూసివేసిన జీడీకే–6ఏ గనిలో ఊపిరాడక మృతి

గోదావరిఖని(రామగుండం): సింగరేణి కార్మికుడి అదృశ్యం విషాదంతో ముగిసింది. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్‌–1 పరిధిలోని జీడీకే–11గనిలోకి వెళ్లి ఈనెల 7న కార్మికుడు కొడెం సంజీవ్‌(58) అదృశ్యమయ్యాడు. 11 రోజుల గాలింపు తర్వాత జీడీకే–6ఏ గని ప్రాంతంలో 43వ లెవల్, 4 సీమ్, 1డీప్‌లో మృతిచెంది కన్పించాడు. మృతదేహాన్ని శుక్రవారం కుళ్లిపోయిన దశలో అధికారులు గుర్తించారు. గనిలో మొదటిషిప్టులో విధుల్లోకి వెళ్లిన సంజీవ్‌ ముందుగా కేటాయించిన పంపు వద్ద నీటిని క్లియర్‌చేసి, 1డీప్, 27వ లెవల్, 4వ సీమ్‌లో పంపు ఆపరేటర్‌గా పనులు చేపట్టాడు. విధుల అనంతరం బయటకు రావాల్సి ఉంది. ఈక్రమంలో దారి తప్పి మూసివేసిన జీడీకే–6ఏగని వైపు సీమ్‌లోకి గాలిలేని ప్రాంతానికి వెళ్లి ఊపిరాడక మృతిచెందాడు. మృతదేహానికి ఐదుమీటర్ల దూరంలో సేఫ్టీల్యాంప్, వాటర్‌బాటిల్‌ పడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దారి తప్పడం వల్లే మృత్యువాత
వయసుపైబడడడం, విధుల వద్ద ఒక్కడే ఉండడం, మానసికస్థితి సరిగా లేకపోవడం వల్ల దారితప్పి మృత్యువాత పడినట్లుగా అధికారులు చెబుతున్నారు. తాను పని చేసిన పంపునకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్‌ దూరంలో మూసివేసిన గని ప్రాంతంలో మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సంజీవ్‌ చనిపోయిన ప్రాంతంలో 2ఫీట్ల మేర నీరు ఉందని అధికారులు తెలిపారు. తెచ్చుకున్న వాటర్‌బాటిల్‌లో నీరు అయిపోవడం, గాలి సరిగా లేకపోవడంతో అక్కడే కుప్పకూలి మృతిచెంది ఉంటాడని అంటున్నారు.

డీడీఎంఎస్‌ ప్రత్యేక బృందాలతో గాలింపు
గని కార్మికుడి అదృశ్యంపై గురువారం రాత్రి రంగంలోకి దిగిన డిప్యూటీ డైరెక్టర్‌ మైన్‌సేఫ్టీ(డీడీఎంఎస్‌) సుబ్రహ్మణ్యం అదేరోజు గనిపైకి వచ్చి జాతీయ కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. గాలింపు జరిపిన బృందాలతో కూడా చర్చించి శుక్రవారం గనిలో వెతకని ప్రాంతాన్ని గుర్తించారు. గనిపై ప్రత్యేక పట్టున్న డిప్యూటీ మేనేజర్లు మాధవరెడ్డి, ఉమాశంకర్, హెడ్‌ఓవర్‌మెన్‌ నాగేశ్వర్‌రావుతో కూడిన ప్రత్యేక బృందాలను జీడీకే–6ఏ గని మూసివేసిన ప్రాంతాన్ని గాలింపు చేసేందుకు నిర్ణయించారు. డీడీఎంఎస్‌ కూడా గనిలోకి దిగి పరిస్థితి సమీక్షిస్తున్న క్రమంలో డిప్యూటీ మేనేజర్‌ మాధవరెడ్డి టీం సంజీవ్‌ మృతదేహాన్ని గుర్తించి డీడీఎంఎస్‌కు సమాచారం చేరవేసింది.

హెచ్‌ఎంఎస్‌ ఫిర్యాదుతో రంగంలోకి డీడీఎంఎస్‌
సింగరేణి కార్మికుడి అదృశ్యంపై హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్‌ ఫిర్యాదుతో డీడీఎంఎస్‌ రంగంలోకి దిగింది. గనిలోనే కార్మికు డు ఉన్నాడని గట్టిగా వాదించడంతోపాటు రియాజ్‌అహ్మద్‌ కూడా డీడీఎంఎస్‌ సిబ్బందితో గనిలోకి దిగి గాలింపు జరిపారు. ఈప్రాంతానికి గాలింపు బృందాలు వెళ్లకపోవడం వల్లే ఆచూకీ లభ్యం ఆలస్యమైంది రియాజ్‌ అహ్మద్‌ ఆరోపించారు.

రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
కార్మికుడి కుటుంబానికి రావాల్సిన ఎక్స్‌గ్రేషియాతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన (కరోనా) అత్యవసర విభాగం కింద గుర్తించి రూ.50 లక్షలు అదనంగా చెల్లించాలని, యాజమాన్యం వైఫల్యానికి అదనంగా మరో రూ.25 లక్షలు చెల్లించాలని జాతీయ సంఘాల నాయకులు రియాజ్‌అహ్మద్, కెంగర్ల మల్లయ్య డిమాండ్‌ చేశారు. సింగరేణి అధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్లే కార్మికుడు మృతిచెందాడని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు.  సంజీవ్‌ కుటుంబస భ్యులను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఓదార్చారు. ఏరియా ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు