అన్ని గ్రామాలకు మిషన్ తాగునీరు

7 Mar, 2017 19:12 IST|Sakshi
అన్ని గ్రామాలకు మిషన్ తాగునీరు

► ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి

డిండి : మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా  2017 చివరి నాటికి తెలంగాణలోని అన్ని గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం తాగు నీరందిస్తుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బాపన్‌కుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వలన డిండి మండలంలో వానలు కురవక కరువు పరిస్థితులు దాపురించాయన్నారు. ఈ నేపథ్యంలో మండల  ప్రజల ఆకాంక్ష మేరకు కనీసం తాగు నీటి వసతి కోసం కల్వకుర్తి ఎత్తి పోతల పథకం ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీరందించాలని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

వారు వెంటనే స్పందించి సంబంధిత నీటి పారుదల శాఖా మంత్రిహరీశ్‌రావుతో మాట్లాడి అందించిన నీటిని డిండి మండల పరిధిలోని కుంటలకు విడుదల చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆయా గ్రామాల రైతులను సోమవారం కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే రిజర్వాయర్లలో మొదటగా సింగరాజుపల్లి వద్ద ప్రారంభమైన  పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

డిండి ఎత్తిపోతల పథకంలో నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు శాశ్వతంగా తాగు, సాగు నీటి సమస్య లేకుండా పోతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీ వీరకారి నాగమ్మ, ఎంపీపీ ముఖ్య సలహాదారుడు రాంకిరణ్, వైస్‌ఎంపీపీ తుమ్మల నీతు, కోఆప్షన్‌ అల్లాహుద్దిన్, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు రాజీనేని వెంకటేశ్వరరావు, యదగిరిరావు, బల్ముల తిర్పతయ్య, శ్రీనువాసులు, కృష్ణయ్య, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు