4 వారాల్లో మిషన్‌ భగీరథ ట్రయల్‌రన్‌

27 Oct, 2017 01:35 IST|Sakshi

మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నాలుగు వారాల్లో మిషన్‌ భగీరథ పంపింగ్‌ స్టేషన్లలో ట్రయల్‌రన్‌ ప్రారంభం కావాలని మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. పంపులు, మోటార్‌ ఎరక్షన్‌కు సుశిక్షితులైన నిపుణులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం సచివాలయంలో పంపులు– మోటార్ల తయారీదారులు, మిషన్‌ భగీరథ వర్క్‌ ఏజెన్సీలతో ఆయన సమావేశం నిర్వహించారు.

మిషన్‌ భగీరథ పథకం కింద ఇప్పటిదాకా ఎన్ని పంపులు– మోటార్లు వచ్చాయనే అంశంపై ఆరా తీశారు. తెలంగాణలోని అన్ని ఆవాసాలకు రాబోయే రెండు నెలల్లో దశల వారీగా భగీరథ నీటిని సరఫరా చేయడానికి కావాల్సిన పంపులు– మోటార్లను తమ యాక్షన్‌ ప్లాన్‌కు అనుగుణంగా సరఫరా చేయాలని కోరారు. అవసరమైతే షిఫ్టులు, లేబర్‌ను పెంచి ఉత్పత్తి జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఇందుకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ఈ ఎలక్ట్రో– మెకానికల్‌ పనుల్లో కీలకమైన హెచ్‌టీ ప్యానెల్‌ బోర్డులను త్వరగా అందించాలని కోరారు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లలో పంపింగ్‌కు కావాల్సిన మిషనరీ వచ్చేలోపు, ఎరక్షన్‌కు కావాల్సిన క్రేన్‌లను సమకూర్చుకోవాలని చీఫ్‌ ఇంజనీర్లకు సూచించారు.

మరిన్ని వార్తలు