ఐదో విడత అంతేనా? 

21 Feb, 2019 13:11 IST|Sakshi

మెదక్‌జోన్‌: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుదని భావించిన  ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం ద్వారా  చెరువులు, కుంటలను మరమ్మతులను చేస్తోంది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో  చెరువుల పూడికతీత పనులు పూర్తి చేసింది.  ఐదో విడతలోనూ వెయ్యి చెరువులకుపైగా మరమ్మతులు చేయాల్సి ఉంది.  ఈ సమయంలో ఐదో విడతకు సంబంధించిన నిధులను కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ  ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల నిర్మాణాలకు మళ్లించారు.

ఈ నిధుల మళ్లింపుతో చెరువుల పునరుద్ధరణ జరిగే అవకాశాలు కానరావడం లేదు. జిల్లాలో మొత్తం 2,681 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,05,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా ఇప్పటివరకు మిషన్‌ కాకతీయ పథకంలోని నాలుగు విడతల్లో 1,679 చెరువులు, కుంటలపునరుద్ధరణ పూర్తి చేశారు. ఇందుకుగాను ఇప్పటి వరకు రూ. 467 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 1,002 చెరువులకు మరమ్మతులు చేయాల్సి ఉంది. మూడో, నాలుగో విడతకు సంబంధించి మిగిలిన 218 చెరువులు వివిధ స్థాయిలో పనులు జరుగుతున్నాయి.

కాల్వలకు ప్రతిపాదనలు....
కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నుంచి జిల్లాకు కాల్వల ద్వారా చెరువు, కుంటల్లోకి మళ్లించేందుకు ఎన్ని కిలోమీటర్లు? ఏ గ్రామంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? ఏ చెరువు నింపితే ఎంత ఆయకట్టుకు లాభం చేకూరుతుందనే వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులు జారీ చేయగానే  ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధ చేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.  ఇప్పటికే జిల్లాలోని హత్నూర, వెల్దుర్తి, నిజాంపేట,రామాయంపేట, తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట తదితర మండలాల్లో కాల్వలకు సంబంధించిన సర్వే పనులు పూర్తయ్యాయి.
 
వాయిదా పడినట్లేనా..?
ఇప్పటికే  నిధులను మంజూరి చేయాల్సి ఉండగా  నేటికి సాంక్షన్‌ చేయలేదు.  ఐదో విడత చెరువులు, కుంటల మరమ్మతులకు ఉపయోగించే మిషన్‌ కాకతీయ నిధులను  కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల ఏర్పాటుకు ఉపయోగిస్తునట్లు తెలుస్తోంది. అందుకే  ఇప్పటివరకు మరమ్మతులు చేయనున్న చెరువులను ఎంపిక చేయలేదని  జిల్లా ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు.  ఈ లెక్కన 5వ విడతలో మిగిలిన చెరువులు, కుంటల 
మరమ్మతులు లేనట్టేనని పలువురు పేర్కొంటున్నారు.  

ఆదేశాలు అందలేదు..
ఇప్పటికే మిషన్‌ కాకతీయ పథకానికి సంబంధించి ఐదో విడత ప్రారంభం కావల్సింది.  కానీ కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల పనులు పలు మండలాల్లో ప్రారంభమయ్యాయి. వాటి ద్వారా కాల్వలను తవ్వేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి గైడ్‌లైన్స్‌ ఇంకా అందలేదు. ఆదేశాలు రాగానే ప్రతిపాదనలు తయారు చేస్తాం.  ఐదో విడత మిషన్‌ కాకతీయకు సంబంధించి ఇప్పటి వరకు ఏలాంటి ఆదేశాలు అందలేదు. –ఏసయ్య, ఇరిగేషన్‌ జిల్లా అధికారి

మరిన్ని వార్తలు