పంద్రాగస్టుకు ఊళ్లకు.. దీపావళికి ఇళ్లకు..

1 Aug, 2018 03:18 IST|Sakshi

మిషన్‌ భగీరథ నీళ్లుఅందజేయాలన్న సీఎం 

పనులు పూర్తికాకపోవడంతో ముహూర్తంలో మార్పు 

మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : మిషన్‌ భగీరథ పథకం ద్వారా దీపావళి(నవంబర్‌ 6) నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన రక్షిత నీటిని అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి అన్ని ఊళ్లకు భగీరథ నీటిని తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంద్రాగస్టు నుంచే ఇంటింటికీ ‘భగీరథ’ద్వారా నీటి సరఫరా చేస్తామని గతంలో ప్రకటించినా.. పనులు పూర్తి కాకపోవడంతో ముహూర్తాన్ని దీపావళికి మార్చారు. భగీరథ పనులపై మంగళవారం ప్రగతి భవన్‌లో  కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికే చాలావరకు పనులు పూర్తయ్యాయని, మిగిలిన కొద్ది పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. ఇప్పటి వరకు నిర్మించిన ఇన్‌టేక్‌ వెల్స్, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, ఓహెచ్‌ఎస్‌ఆర్, ఓహెచ్‌బీఆర్, డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు అన్నింటినీ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పనుల్లో అనుకున్నంత వేగం లేని ప్రాంతాల్లో భగీరథ వైస్‌ చైర్మన్, సెక్రటరీ, ఈఎన్‌సీ స్వయంగా పర్యటించాలని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతి, ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం నేరుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్క్‌ ఏజెన్సీలతో మాట్లాడారు. పది జిల్లాల్లో పనులు వందకు వంద శాతం పూర్తవుతున్న నేపథ్యంలో కొద్దిరోజుల్లోనే ఆయా జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ జె.సంతోశ్‌ కుమార్‌ అధికారులు శాంత కుమారి, స్మితా సభర్వాల్, కృపాకర్‌ రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, మిషన్‌ భగీరథ సలహాదారులు జ్ఞానేశ్వర్, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు