‘భగీరథ’ నీళ్లొచ్చేనా..!

16 Apr, 2019 09:07 IST|Sakshi
హౌజింగ్‌బోర్డు కాలనీలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మాణం

కరీంనగర్‌కార్పొరేషన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకం పనులు నత్తనడక కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ల అలసత్వం.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి. నిండు వేసవిలో కరీంనగర్‌ నగర ప్రజలకు నీటి తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే బోర్లు ఎండిపోయి నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారు. దీనికి తోడు నీటి సరఫరాలో ఇబ్బందులతో తాగునీటి తండ్లాట మొదలైంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా 24/7 నీటి సరఫరాకు కరీంనగర్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. కరీంనగర్‌కు వరప్రదాయినిగా ఉన్న లోయర్‌ మానేరు డ్యాంతోనే ఇది సాధ్యమవుతుందని భావించారు.

తెలంగాణలోనే ఏ నగరానికి లేని తాగునీటి వనరులు కరీంనగర్‌కు ఉన్నాయి. ఎల్‌ఎండీలో నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ప్రయోగాత్మకంగా నిరంతరంగా నగరానికి తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. నగరానికి నిరంతర నీటి సరఫరాకు కార్యాచరణ జరుగుతుండగా ఆశలన్నీ అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకం మీదే ఉన్నాయి. పథకం పూర్తయితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుండడంతో ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

మిషన్‌ భగీరథ ద్వారానే నిరంతర నీటి సరఫరాకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సంపులు, పైపులైన్‌ కనెక్షన్లు, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. గతేడాది నవంబర్‌లోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరిగింది. ప్రభుత్వం గడువు పెంచి మార్చి నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించింది. అయినా పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

రూ.109 కోట్లతో పనులు...
నగరంలో అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకం కింద ప్రభుత్వం రూ.109.26 కోట్లు మంజూరు చేసింది. వీటితోపాటు పాటు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు అమలులో ఉండడంతో 24 గంటల నీటి సరఫరాకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 16 ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు తోడు మరో 3 ఓవర్‌హెడ్‌ ట్యాంకులు మిషన్‌ భగీరథ పథకంలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 43 వేల నల్లా కనెక్షన్లకు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుండగా, మిషన్‌ భగీరథ పనులు పూర్తయితే నిరంతర నీటి సరఫరా జరగనుంది. అన్ని డివిజన్లలో పనులు ప్రారంభించడంతో పైపులైన్ల పనులు కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల 8 గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. గ్రామాలన్నింటికీ కార్పొరేషన్‌తో సమానంగా నీటి సరఫరా చేయాల్సి ఉంది.

రెండు సార్లు గడువు పెంచినా...
అర్బన్‌ మిషన్‌ భగీరథ పనులు 2017 మేలో ప్రారంభించారు. పూర్తిచేసేందుకు 18 నెలల కాల వ్యవధిని విధించారు. అంటే గతేడాది నవంబర్‌లోనే పూర్తిచేయాల్సి ఉన్నా పూర్తి కాలేదు. మరోమారు ఈ యేడాది మార్చి ఆఖరులోగా పనులు పూర్తిచేసి నీటిని సరఫరా చేయాలని గడువు పెంచారు. గడువు ముగిసినా పనులు మాత్రం పూర్తికాలేదు. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక పనులు పూర్తిచేసి ఇంటింటికీ నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.

వంద శాతం పైపులైన్ల పనులు పూర్తికాకపోవడంతో ఎక్కడా ఇంటర్‌ కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. 2033 సంవత్సరం కల్లా 4.03 లక్షల జనాభాకు సరిపడేలా 68.65 ఎంఎల్‌డీ(మిలియన్‌ లీటర్‌ పర్‌ డే) సామర్థ్యంతో ఫిల్టర్‌బెడ్, 3000 కేఎల్‌ సామర్థ్యంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారు. దీని పనులు 40 శాతం మేర పూర్తయ్యాయి. 800 కిలో లీటర్ల సామర్థ్యం గల సంపు, పంపుహౌజ్‌ను ఫిల్టర్‌బెడ్‌ దగ్గర నిర్మిస్తున్నారు. దీని పనులు చివరి దశలో ఉన్నాయి. రాంనగర్‌లో 1300 కిలో లీటర్ల ట్యాంకు పనులు 60 శాతం మేర, హౌజింగ్‌బోర్డు కాలనీలో 2200 కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మాణం చేస్తున్న ట్యాంకు పనులు 80 శాతం పూర్తయ్యాయి.

ఎప్పటికి పూర్తవునో...
ప్రతిష్టాత్మకమైన భగీరథ పనులు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పెంచిన గడువు ప్రకారం ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం ఏప్రిల్‌ నుంచి ఇంటింటికి తాగునీరు అందించాలని గడువు విధించింది. ఆ గడువు కూడా ముగిసింది. రిజర్వాయర్లు, సంపుల నిర్మాణం, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ ఆ పనులు పూర్తికాలేదు. పైపులైన్ల అనుసంధానం పనులు సైతం ఆశించిన స్థాయిలో జరగడంలేదు. మిషన్‌ భగీరథ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తేనే నిరంతర నీటి సరఫరాకు అడ్డంకులు తొలగుతాయి.

మరిన్ని వార్తలు