‘సాక్షి’కి మిషన్‌ కాకతీయ అవార్డులు

22 Feb, 2018 01:11 IST|Sakshi
కె.మల్లికార్జున్‌రెడ్డి , కె.విక్రమ్‌రెడ్డి

ప్రింట్‌ మీడియా విభాగంలో కె.మల్లికార్జున్‌రెడ్డి 

ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగంలో విక్రమ్‌రెడ్డి ఎంపిక 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ కాకతీయ పథకంపై ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి బుధవారం అవార్డులను ప్రకటించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగాల్లో ఇద్దరు ‘సాక్షి’ జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ప్రింట్‌ మీడియా విభాగంలో సంగారెడ్డి జిల్లా ప్రతినిధి కల్వల మల్లికార్జున్‌రెడ్డి రాసిన ‘పడావు భూముల్లో సిరుల పంట’అందోల్‌ పెద్ద చెరువు విజయగాథ కథనానికి రాష్ట్ర స్థాయిలో మూడో బహుమతి లభించింది.

చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు నెలవుగా ఉన్న అందోల్‌ పెద్ద చెరువు 30 ఏళ్లుగా పడావులో ఉన్న వైనాన్ని వివరిస్తూ.. రెండేళ్లుగా పుట్ల కొద్దీ ధాన్యంతో రైతులు పులకిస్తున్న తీరుకు ఈ కథనం అద్దం పట్టింది. ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగంలో ‘సాక్షి’టీవీ ప్రతినిధి కొత్తకాపు విక్రమ్‌రెడ్డి ‘జలకళ’ పేరిట మిషన్‌ కాకతీయ ఫలితాలతో సాగు విస్తీర్ణం పెరిగిన తీరుపై ఇచ్చిన ప్రత్యేక కథనానికి రాష్ట్ర స్థాయిలో మూడో బహుమతి లభించింది. అవార్డుకు ఎంపికైన సాక్షి పాత్రికేయులు       అవార్డుతో పాటు రూ.50 వేల నగదును త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవంలో అందుకోనున్నారు.  

మరిన్ని వార్తలు