నిర్లక్ష్యం చేస్తే చర్యలు

30 May, 2018 09:53 IST|Sakshi
ఇరిగేషన్‌ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌

వంగూరు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న మిషన్‌ కాకతీయ చెరువు మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్‌ చేయిస్తానని ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం వంగూరు మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మిషన్‌ కాకతీయ పనులు వంగూరు మండలంలో వేగవంతంగా జరగకపోవడం, ఫేస్‌–1, ఫేస్‌–2లో ఐదు చెరువులు పూర్తికాకపోవడం, మూడు, నాలుగు దశల్లో మంజూరైన చెరువుల పనులను పూర్తి చేయకపోవడం కొన్నింటిని ప్రారంభించకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమీషన్ల కోసం..
గొలుసుకట్టు చెరువుల ద్వారా రైతులకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయలను కేటాయిస్తుంటే అధికారులు, కాంట్రాక్టర్లు కమీషన్ల కోసం కక్కుర్తిపడి పనులు ఆలస్యం చేస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల అన్నారు. అవసరమూతే సంబంధిత అధికారులు చెరువుల వద్దే ఉండి పనులు చేయించాలని ఇరిగేషన్‌ ఏఈ తిరుపతయ్యను ఆదేశించారు.

 
చర్యలు తీసుకోవాలి
అలాగే సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన హార్టికల్చర్, ఆర్టీసీ, ఎక్సైజ్, సోషల్‌ వెల్ఫేర్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంపీడీఓను ఆదేశించారు. మూడు నెలలకోసారి జరిగే సర్వసభ్య సమావేశానికి కూడా హాజరు కావడానికి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారుల తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు.

 సమస్యలు పరిష్కరించాలి

సభలో చౌదర్‌పల్లి సర్పంచ్‌ అంజన్‌రెడ్డి, పోతారెడ్డిపల్లి సర్పంచ్‌ శంకర్, గాజర సర్పంచ్‌ చంద్రయ్య తదితరులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారులు అధ్యయనం చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

సర్పంచ్‌లకు సన్మానం

ఉమ్మడి వంగూరు మండలంలోని 24 గ్రామపంచాయతీల సర్పంచ్‌లకు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పదవీ కాలాన్ని పూర్తిచేసుకోవడం, ప్రస్తుత సర్పంచ్‌లకు చివరి సర్వసభ్యసమావేశం ఇదే కావడంతో వారికి శాలువాలు, దండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు మాట్లాడుతూ ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి కోసం వారు కష్టపడిన తీరు, గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యే, అధికారులు సహకరించిన విధానం తదితర అంశాలను నెమరు వేసుకున్నారు.

తమ పదవీకాలం పూర్తయినప్పటికీ గ్రామాల్లో తాము చేపట్టిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ భీముడు నాయక్, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ సుశీల్‌కుమార్, ఎంపీడీఓ హిమబిందు, కోఆప్షన్‌ సభ్యుడు హమీద్, ఎంఈఓ శంకర్‌నాయక్, వ్యవసాయాధికారిణి తనూజారాజు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు