‘కాకతీయ’ మట్టి కాలేజీకి!

17 Jun, 2015 10:39 IST|Sakshi
‘కాకతీయ’ మట్టి కాలేజీకి!

పెద్దపల్లి ఎమ్మెల్యేకు కలిసొచ్చిన మిషన్ కాకతీయ
సుమారు 4,500 ట్రిప్పుల మట్టి తరలింపు
సీఎం పేషీకి ఫిర్యాదు

 
పెద్దపల్లి రూరల్:  రాష్ట్ర ప్రభుత్వం మహాయజ్ఞంగా తలపెట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమ లక్ష్యం పక్కదారి పడుతోంది. టెండర్ల ప్రక్రి య మొదలు మట్టిని తరలించేవరకు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తోందనే దానికి పెద్దపల్లి నియోజకవర్గమే నిదర్శనం. ఈ నియోజకవర్గ పరిధిలో మిషన్ కాకతీయ కాంట్రాక్టు పనులన్నీ దాదాపుగా తన అనుచరులు, బంధువులకే దక్కేలా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పనిలో పనిగా చెరువు మట్టిని సైతం వదల్లేదు. చెరువు మట్టిని పొలాల్లోకే తరలించాలని రైతులకు పిలుపునిచ్చి, అందుకు భిన్నంగా తన సొంత ప్రయోజనాలకు వాడుకోవడం చర్చనీయాంశమైంది.

పెద్దపల్లిలోని ట్రినిటీ కళాశాల మైదానాన్ని చదును చేసుకునేందుకు రెండు చెరువుల నుంచి 4 వేల 500 ట్రిప్పుల మట్టిని తరలించినట్లు తెలుస్తోంది. బందంపల్లి చెరువు నుంచి 200 ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఏకంగా 4 వేల ట్రిప్పుల మట్టి మొరం తరలించారు. కాసులపల్లి చెరువు నుంచి 500 ట్రిప్పులకు పైగా మట్టిని కాలేజీకి తరలించారు. చెరువు మట్టి రైతులకు అవసరం లేనప్పుడు, సదరు చెరువు మట్టి పొలాలకు పనికి రాదని భావిస్తేనే ఇతరత్రా అవసరాలకు వినియోగించాలి. అందుకు గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం.

ఆ మట్టిని సైతం క్యూబిక్ మీటర్‌కు రూ.60 చొప్పు న రుసుం చెల్లించి తీసుకెళ్లాలి. ఈ 4 వేల ట్రిప్పుల మట్టికి ఎలాంటి రుసుం ప్రభుత్వానికి చెల్లించలేదని పేర్కొంటూ టీడీపీ నాయకులు ఉప్పు రాజు, ఎడె ల్లి శంకర్, సీపీఐ నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్, తాండ్ర సదానందం, సీపీఎం నాయకుడు రమేశ్ తదితరులు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. పొలాల్లోకి తరలించాల్సిన సారవంతమైన భూమిని సొంత కాలేజీకి ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. అధికారులపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు ఎమ్మెల్యేనుంచి జరిమానా వసూలు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు