'మిషన్' ఆరంభానికి గ్రహణం!

7 Mar, 2015 04:29 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకం ఆరంభానికి గ్రహణం పట్టింది. జనవరి చివరి వారంలోనే చెరువుల మరమ్మతు పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినా ఇప్పటికీ కనీసం తేదీలను కూడా ఖరారు చేయలేదు. పనుల అంచనాలు, పరిపాలనా అనుమతులు, టెండర్లు, ఒప్పందాలపై చిన్న నీటి పారుదల శాఖ ఎంతో శ్రమించి అన్నింటినీ సిద్ధం చేసినా.. ముఖ్యమంత్రి స్థాయిలో పనుల ఆరంభ తేదీలపై నిర్ణయం జరగకపోవడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. వర్షాకాలానికి మరో మూడు నెలల గడువు మాత్రమే ఉండటం, ఈలోగా సుమారు 9 వేలకు పైగా చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉండటం నీటిపారుదల శాఖ అధికారులను కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ఎప్పటిలోగా నిర్ణయం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

లక్ష్యం 9 వేల చెరువుల పునరుద్ధరణ
రాష్ట్రంలో గుర్తించిన 46,531 చెరువుల్లో ఏటా 20 శాతం చెరువులను అంటే సుమారు 9 వేల చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ ఏడాది 9,651 చెరువుల పనులను లక్ష్యంగా పెట్టుకున్న చిన్న నీటి పారుదల శాఖ ఇందులో ఇప్పటికే 8 వేల చెరువుల సర్వేలు పూర్తి చేసి, 7 వేల చెరువుల అంచనాలను సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటి వరకు 5,200 చెరువులకు సుమారు రూ.1,600 కోట్ల విలువైన పరిపాలనా అనుమతులు సైతం ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 2 వేలకు పైగా చెరువుల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. పూడికతీత మట్టిని పొలాలకు తరలించేందుకు వీలుగా ఇప్పటికే వ్యవసాయ శాఖ భూసార పరీక్షలను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే 4 వేల చెరువుల మట్టి నమూనాలకు పరీక్షలు సైతం పూర్తి చేశారు. నీటి పారుదల శాఖ అధికారులు అంతా సిద్ధం చేసినా పనుల ఆరంభం మాత్రం జరగడం లేదు.  వర్షాకాలానికి కేవలం మూడు నెలల వ్యవధే ఉండటం, పనులు చేయాల్సిన చెరువుల లక్ష్యం భారీగా ఉండటంతో ఫిబ్రవరి మొదటి వారంలోనే పునరుద్ధరణ పనులు ఆరంభించాలని నిర్ణయించారు. ఈ పనులను  కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతితో ఆరంభించాలని ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు సైతం చేసింది.

నాలుగు జిల్లాల్లో ప్రతిపాదనలు
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకే రోజు పనులు ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు ఆయా జిల్లాల్లో నాలుగేసి చెరువులను ఎంపిక చేసి  ప్రతిపాదనలను పక్షం రోజుల కిందట సీఎం కార్యాలయానికి పంపారు. సీఎం తేదీలను నిర్ణయిస్తే పనులను ఆరంభిస్తామని తెలియజేశారు. అయినప్పటికీ ఇంతవరకు సీఎంఓ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దానికి తోడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటం, ఫలితంగా సీఎం బిజీగా మారనుండడంతో ఆరంభ తేదీల నిర్ణయం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే నిర్ణీత లక్ష్యాలను ఎలా చేరుకుంటామన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అసెంబ్లీ సమావేశం వాయిదా అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు మరోమారు ముఖ్యమంత్రిని కలసి ఈ విషయంపై విన్నవించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు