తవ్వినకొద్దీ తప్పులు!

4 Oct, 2017 02:55 IST|Sakshi

రెవెన్యూ రికార్డుల్లో భారీగా బయటపడుతున్న అవకతవకలు

27%  భూరికార్డుల ప్రక్షాళనలో తప్పులున్నట్లు వెల్లడైంది

90 - 95% సక్రమంగా ఉంటాయని సర్కారు భావించింది

సాక్షి, హైదరాబాద్‌: భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా తవ్వినకొద్దీ రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, అవకతవకలు బయటపడుతున్నాయి. ప్రక్షాళన కార్యక్రమం జరిగేకొద్దీ తప్పుల శాతం పెరిగిపోతుండడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. దీంతో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందా అని రెవెన్యూ వర్గాలే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు 20 రోజులపాటు జరిగిన ప్రక్షాళన కార్యక్రమంలో ఏకంగా 27.5 శాతం తప్పులున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మరింతగా పెరుగుతూనే..
వాస్తవానికి భూరికార్డుల్లో 5 నుంచి 10% వరకే తప్పులు ఉంటాయని.. వాటిని గుర్తించి సరిచేయడం ద్వారా ఇబ్బంది లేకుండా రైతులకు ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేయవచ్చని ప్రభుత్వం భావించిం ది. కానీ సరిచేయాల్సిన రికార్డుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. సర్వే మొదలైన మూడు, నాలుగు రోజుల గణాంకాల వరకు 84% రికార్డులు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు.

పది రోజుల తర్వాత ఇది 78 శాతానికి తగ్గగా.. మంగళవారం నాటి లెక్కలు చూస్తే 72.5 % రికార్డులే సక్రమంగా ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యా ప్తంగా 14,04,597 సర్వే నంబర్ల రికార్డులను పరిశీలించగా.. అందులో 10,17,907 సర్వే నంబర్ల రికార్డులే సక్రమంగా ఉన్నాయని, 3,86,690 నంబర్ల రికార్డులను సవ రించాల్సిందేనని వెల్లడైనట్లుగా తెలిపాయి.

పట్టాదారుల పేర్ల తప్పులే లక్షన్నర!
భూరికార్డుల్లో కీలకమైన పట్టాదారుల పేర్లలో తప్పులున్నట్లు గుర్తించారు. భూమి ఒకరిదైతే రికార్డుల్లో మరొకరి పేరు ఉండడం, పట్టాదారులు చనిపోయి ఏళ్లు గడుస్తు న్నా రికార్డులు ఫౌతి చేయకపోవడం, పేర్లలో క్లరికల్‌ తప్పిదాలు వంటి సమస్యలున్నాయి. మొత్తం తప్పుల్లో లక్షన్నర వరకు ఇవి ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. పట్టాదారుల పేర్లలో క్లరికల్‌ తప్పిదాలను సరిచేయడం సులువే అయినా.. రికార్డుల్లో పట్టాదారుల పేర్లు మార్చడంలో, వారసుల పేరిట రికార్డులు మార్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


భూవినియోగ మార్పిడి సమస్య కూడా
మరో ముఖ్యమైన సమస్య నాలా భూములు. వ్యవసాయ భూములుగా రికార్డుల్లో ఉండి వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగిస్తున్న భూములు పెద్ద ఎత్తున ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 26,414 సర్వే నంబర్లలోని భూములు ఈ విధంగా వినియోగంలో ఉన్నట్లు తేలింది. ఇప్పుడు వీటన్నింటినీ నాలా కన్వర్షన్‌ చేయడం తలనొప్పిగానే మారనుంది. ఇంకా ప్రక్షాళనలో 10 శాతం కూడా పూర్తికాకుండానే పరిస్థితి ఇలా ఉంటే.. చివరి వరకు ఎలాంటి సమస్యలు వస్తాయో.. సవరించాల్సిన రికార్డుల శాతం ఏ మేరకు పెరుగుతుందోనని రెవెన్యూ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


భూరికార్డుల ప్రక్షాళనలో ముఖ్య గణాంకాలివే..
పరిశీలించిన సర్వే నంబర్లు - 14,04,597
సక్రమంగా ఉన్నవి - 10,17,907
సవరించాల్సినవి - 3,86,690
పట్టాదారులు సరిపోలనివి - 21,959
ఫౌతి చేయాల్సినవి - 56,202
క్లరికల్‌ తప్పిదాలున్నవి - 71,453
రికార్డుల కన్నా ఎక్కువ, తక్కువ భూములున్నవి - 36,399
నాలా భూములున్నవి - 26,414

మరిన్ని వార్తలు