తప్పిదాలను పునరావృతం చేయొద్దు

5 Apr, 2019 15:35 IST|Sakshi
శిక్షణలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

విధుల పట్ల  అప్రమత్తంగా ఉండాలి 

మాక్‌ పోలింగ్‌ అయ్యాక ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిచేయాలి  

సాక్షి, జడ్చర్ల టౌన్‌: పోలింగ్‌ విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు చిన్న చిన్న తప్పిదాలను పునరావృతం చేసుకుంటూ జవాబుదారీగా మారొద్దంటూ మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. గురువారం జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన జడ్చర్ల అసెంబ్లీ పీఓలు, ఏపీఓల ఎన్నికల శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన చిన్న తప్పిదాలే పెద్ద చర్చగా మారాయని గుర్తుచేశారు. మాక్‌పోలింగ్‌ అయ్యాక తప్పనిసరిగా ఈవీఎంలు, వీవీప్యాట్లు క్లియర్‌ చేసి పోలింగ్‌కు వెళ్లాలని, పోలింగ్‌ ముగిశాక తప్పనిసరిగా ఈవీఎం క్లోజ్‌ చేయాలన్నారు. అలా చేయకపోవడం వల్ల కౌంటింగ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.

ఫలితంగా ఎన్నికల కమిషన్‌కు జవాబుదారీగా మారాల్సి వస్తుందన్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుని విధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాక్‌పోలింగ్‌ చేసి ఈవీఎంలు క్లియర్‌ చేయలేదని, వారిలో కొందరు సమాచారం ఇచ్చినా మరికొందరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారన్నారు. తద్వారా సస్పెన్షన్‌కు గురి కావాల్సి వచ్చిందన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోలింగ్‌ జరిగాక ఇచ్చిన పోలింగ్‌ శాతం తప్పుగా ఇవ్వద్దని, మీరిచ్చే నివేదికల ఆధారంగానే మీడియాకు సమాచారం అందిస్తామన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల పోలింగ్‌ పర్సంటేజీల విషయంలో తప్పుగా ఇవ్వడం వల్ల పెద్ద రచ్చ అయిన విషయాన్ని గుర్తుచేసి అలాంటి పొరపాట్లు చేయవద్దన్నారు. ఈవీఎం, వీవీప్యాట్లతోపాటు 17ఏ, 17సీ వంటి మొతం 7 రికార్డుల్లోనూ పోలైన ఓట్ల సంఖ్య ఒకేలా ఉండాలన్నారు. పోలింగ్‌కు అవసరమైన 9 డాక్యుమెంట్లతో బుక్‌లెట్‌ చేశామని, దానిని చింపకుండా సక్రమంగా రాసి రిసెప్షన్‌ కౌంటర్‌లో సమర్పించాలన్నారు. పోలింగ్‌ ముందురోజు డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌కు సకాలంలో చేరుకుని కేంద్రాలకు సమయానికి చేరుకుని ఎన్నికలకు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్‌ ముగిశాక త్వరగా రిసెప్షన్‌ సెంటర్‌కు చేరుకుని ఈవీఎంలు, వీవీప్యాట్, బుక్‌లెట్, డిస్‌ప్లే యూనిట్‌ను సమర్పించి వెళ్లాలన్నారు.

కేంద్రాల్లో ఏవైనా సమస్యలు వస్తే బుక్‌లెట్‌లో సూచించిన ఫోన్‌ నంబరుకు సమాచారం ఇవ్వాలని, జడ్చర్ల అసెంబ్లీ పరిధిలోని ఊర్కొండ మండలంలో పనిచేసే సిబ్బంది మాత్రం మహబూబ్‌నగర్‌ కోడ్‌ను ఉపయోగించి ఫోన్‌ చేయాలన్నారు. సమయాన్ని వృథా చేయడం మనకు అలవాటని, అలా చేయకుండా ఎన్నికలు విజయవంతం చేద్దామన్నారు.

గుర్తింపు కార్డులు తేవాల్సిందే 
ఓటరు స్లిప్‌లు తీసుకువచ్చిన ఓటర్లను ఓటు వేయడానికి అనుమతి ఇవ్వవద్దని, తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాల్సిందేనని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు ముందుగానే తెలియజేయాలని, అంతకు ముందురోజు రాత్రి గ్రామాల్లో ప్రచారం చేయిస్తామన్నారు. శిక్షణలో సబ్‌ కలెక్టర్, ప్రత్యేక అధికారి క్రాంతి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, 300 మంది పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు