కార్లకు ఫుల్‌..బైక్‌లకు డల్‌

16 Oct, 2018 02:25 IST|Sakshi

స్వయం ఉపాధి పథకాలకు మిశ్రమ స్పందన

సాక్షి, హైదరాబాద్‌: స్వయం ఉపాధి పథకాలకు నిరుద్యోగ యువత నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2018–19 వార్షిక సంవత్సరంలో మోటార్‌ ఎంపవర్మెంట్‌ కింద 4 వేల యూనిట్లు పంపిణీ చేయాలని యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం క్యాబ్‌లతోపాటు ఈ కామర్స్‌ కంపెనీలకు సంబంధించిన సర్వీసులకు బాగా డిమాండ్‌ ఉంది. దీంతో క్యాబ్‌ కేటగిరీలో 2 వేల కార్లు, బైక్‌ కేటగిరీలో 2 వేల ద్విచక్ర వాహనాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. క్యాబ్‌ కేటగిరీకి ఎంపికైన లబ్ధిదారుకు గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీ ఇస్తారు. బైక్‌ కేటగిరీలో యూనిట్‌ విలువపై 80 శాతం వరకు రాయితీ ఇస్తారు.

ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్‌ ఆగస్టు తొలివారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సెప్టెంబర్‌ 20తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. భారీ ఎత్తున రాయితీ ఆశిస్తున్న నిరుద్యోగ యువత క్యాబ్‌ కేటగిరీ వైపే మొగ్గు చూపగా.. బైక్‌ కేటగిరీ వైపు కనీసం ఆసక్తి చూపలేదు. క్యాబ్‌ కేటగిరీలో 6,360 మంది దరఖాస్తు చేసుకోగా.. బైక్‌ కేటగిరీలో 982 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. క్యాబ్‌ కేటగిరీ పథకాన్ని గతంలోనూ అమలు చేయడంతో క్షేత్రస్థాయిలో కొంత అవగాహన ఉంది. దీంతో ఈ కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు బైక్‌ కేటగిరీని కొత్తగా తెచ్చారు. అయితే దీనిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గి ఉండొచ్చని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా