హస్తం జోరు...ఫ్యాను హోరు...

17 May, 2014 03:21 IST|Sakshi
హస్తం జోరు...ఫ్యాను హోరు...

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా ఓటరు ఎప్పటిలాగే విభిన్న తీర్పునిచ్చాడు. సార్వత్రిక ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. శుక్రవారం వెలువడిన ఈ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ-సీపీఎం కూటమికి నాలుగు అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెస్‌కు నాలుగు, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు ఒక్కో స్థానం చొప్పున లభించాయి. పినపాక, అశ్వారావుపేట, వైరాల్లో వైఎస్సార్‌సీపీ, భద్రాచలంలో సీపీఎం విజయఢంకా మోగించగా..., ఇల్లెందు, పాలేరు, మధిర, ఖమ్మం అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. కొత్తగూడెంలో టీఆర్‌ఎస్, సత్తుపల్లిలో టీడీపీ విజయం సాధించాయి. ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోగా, మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్ గెలిచింది. జిల్లాలో టీఆర్‌ఎస్ బోణీ కొట్టగా, సీపీఐ మాత్రం ఒక్క స్థానం కూడా గెలుపొందలేకపోయింది.

 విజేతలు వీరే...
 పినపాకలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు మొదటి నుంచీ ఊహించినట్టుగానే మంచిమెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 14వేలకుపైగా ఆధిక్యం లభించింది. ఇక్కడ టీఆర్‌ఎస్ రెండోస్థానంలో నిలిచింది. అశ్వారావుపేటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు
  గెలుపొందగా, ఆయనకు టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 900 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక వైరాలో కూడా వైఎస్సార్‌సీపీ సునాయస విజయాన్నే సాధించింది. ఇక్కడి నుంచి పోటీచేసిన బాణోతు మదన్‌లాల్ తన సమీప టీడీపీ అభ్యర్థి బాలాజీనాయక్‌పై 9వేలకుపైగా ఓట్లతో గెలుపొందారు.

 ఇక వైఎస్సార్‌సీపీతో అవగాహన కుదుర్చుకుని ఎన్నికల బరిలో దిగిన సీపీఎంకు జిల్లాలో ఒక స్థానం దక్కింది. భద్రాచలం నుంచి సీపీఎం పక్షాన పోటీచేసిన సున్నం రాజయ్య 1800 ఓట్ల తేడాతో ఫణీశ్వరమ్మ (టీడీపీ)పై గెలిచారు. కాంగ్రెస్‌కు కూడా ఈ ఎన్నికలలో మంచి ఫలితాలే వచ్చాయి. మొత్తం నాలుగు స్థానాలను ఆపార్టీ దక్కించుకుంది. రాంరెడ్డి వెంకటరెడ్డి (పాలేరు), మల్లు భట్టివిక్రమార్క (మధిర)లకు ప్రజలు మరోసారి అవకాశం కల్పించారు. ఇక గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన ఇల్లెందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య కల ఈసారి ఫలించింది. ఈయన తన ప్రత్యర్థి హరిప్రియ (టీడీపీ)పై 11వేల పైచిలుకు ఆధిక్యంతో గెలుపొందారు.

ఇక, తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పువ్వాడ అజయ్  మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు (టీడీపీ)పై విజయం సాధించారు. గత ఎన్నికలలో మూడుస్థానాలు గెలిచిన తెలుగుదేశం పార్టీ ఈసారి ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. సత్తుపల్లి నుంచి ఆపార్టీ తరఫున పోటీచేసిన సండ్రవెంకటవీరయ్య గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మట్టాదయానంద్‌పై 3వేల మెజార్టీతో గెలుపొందారు. ఇక, టీఆర్‌ఎస్ జిల్లాలో బోణీ కొట్టింది. ఆ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో గెలుపొందింది. జలగం వెంకట్రావు టీఆర్‌ఎస్ తరఫున 16వేలకు పైగా ఆధిక్యంతో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు.

  మన ఎంపీలు వీరే...
 ఖమ్మం పార్లమెంటు స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి నామా నాగేశ్వరరావు (టీడీపీ)పై 11,313 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడి నుంచి పోటీచేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్. కె.నారాయణ మూడోస్థానంలో నిలిచారు. భద్రాచలం, ఇల్లెందు, పినపాక అసెంబ్లీ స్థానాలు వచ్చే మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో టీఆర్‌ఎస్ గెలుపొందింది. అక్కడి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలుపొందారు.

 సిట్టింగ్‌లు ఓడారు
 జిల్లా నుంచి గత శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. సిట్టింగ్‌లుగా ఉన్న వారిలో ముగ్గురికి మాత్రమే మరోసారి అవకాశం ఇచ్చారు ఓటర్లు. రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, సండ్ర వెంకటవీరయ్యలు మాత్రమే మళ్లీ గెలుపొందారు. తుమ్మల నాగేశ్వరరావు, బాణోతు చంద్రావతి, కూనంనేని సాంబశివరావు, ఊకె అబ్బయ్య, కుంజా సత్యవతి, వగ్గెల మిత్రసేన ఈసారి ఓడిపోయారు. పినపాక ఎమ్మెల్యేగా పనిచేసిన రేగాకాంతారావు అసలు ఎన్నికల బరిలోనే లేరు. అయితే, ఈసారి అనూహ్యంగా జిల్లా నుంచి మహిళలకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ ఎన్నికలలో వివిధ ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న ఐదుగురు మహిళా అభ్యర్థులూ ఓటమిపాలుకాక తప్పలేదు.

 వీరూ కొత్తే... వారూ కొత్తే
 తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనసభకు ఎన్నికయిన ఎమ్మెల్యేలంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందని, జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెపుతున్నారు. అయితే, వీరిలో ఏడుగురు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే. గత అనుభవం ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, పాయం వెంకటేశ్వర్లు, సండ్రవెంకటవీరయ్య, జలగం వెంకట్రావు, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లులు మళ్లీ గెలుపొందారు. అయితే, కొత్తగా గెలిచిన వారితో పాటు వీరు కూడా తెలంగాణ అసెంబ్లీకి కొత్తవారే కానున్నారు. ఈసారి ముగ్గురు కొత్తగా అసెంబ్లీకి అడుగుపెట్టబోతున్నారు. వీరిలో వైరా నుంచి మదన్‌లాల్, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య గత ంలో ఎన్నికల బరిలో ఉన్నా ఓటమిపాలయ్యారు. ఈసారి మాత్రం ఓటరుదేవుడి ఆశీర్వాదం లభించడంతో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక, తొలిసారి ప్రత్యక్ష బరిలో ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్ తొలిప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మరిన్ని వార్తలు