నామినేషన్‌ ఏరోజు వేద్దాం !

12 Nov, 2018 15:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముహూర్త బలం కోసం అభ్యర్థుల వెతుకులాట

జ్యోతిష్యులు, పండితులతో చర్చోపచర్చలు  

నక్షత్ర బలమే జన బలమని నమ్ముతున్న నేతలు

పెళ్లి చేయాలన్నా.. ఇల్లు నిర్మించాలనుకున్నా.. కుర్చీలో కూర్చోవాలనుకున్నా... ఇలా ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా తిథులు... వారాలు.. నక్షత్రాలు.. రోజులు, గడియలు చూస్తారు. అసలే ఎన్నికల సమయం కావడం నామినేషన్ల పర్వం సోమవారం నుంచి ప్రారంభం అవుతుండటంతో అభ్యర్థులు నామినేషన్లపై ప్ర«ధానంగా దృష్టి సారించారు. పుణ్యమాసమైన కార్తీక మాసంలో నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతుండటంతో మంచి ముహూర్త కాలంలో నామినేషన్‌ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు గాను అభ్యర్ధులు జ్యోతిష్యులు, పండితులతో ముహూర్త బలం గురించి చర్చలు జరుపుతున్నారు.

సాక్షి, షాద్‌నగర్‌ టౌన్‌: అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల పర్వానికి తెరలేవనుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులందరూ నామినేషన్లను దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 12 నుంచి 19 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. 20న «నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 
సెంటిమెంటుకు విలువ ఇస్తూనే..
ఇప్పటి వరకు పార్టీలు ప్రకటించిన అభ్యర్థులతో పాటు పార్టీల నుంచి టికెట్‌ వస్తుందని ధీమాలో ఉన్న నేతలు, స్వతంత్ర అభ్యర్థులు, నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. అభ్యర్థులు సెంటిమెంటుకు విలువ ఇస్తూనే తమ పేరుపై రాజకీయ బలం ఎలా ఉందో చూసి చెప్పాలని జ్యోతిష్యులను అడుగుతున్నారు. జనంలో మంచి పేరు ఉంటే చాలు అన్ని రోజులు మంచివేననే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ముహూర్తాలు ఇలా.. 

  • 12వ తేదీ సోమవారం,  పంచమి తిథి, పుర్వాషాడ నక్షత్రం కావడంతో అభ్యర్థులకు అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. 
  • 13వ తేదీ మంగళవారం తిథి షష్టి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటడం, మంగళవారం కావడంతో కొందరు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఆసక్తి కనబర్చరు.
  • 14వ తేదీ బుధవారం, సప్తమి తిథి, శ్రవణా నక్షత్రం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు అధికంగా వేసే అవకాశాలు ఉన్నాయి.
  • 15వ తేదీ గురువారం, ఉదయం 8.45నిమిషాల వరకే సప్తమి తిథి ఉంది. ఆ తర్వాత అష్టమి వస్తుండటంతో ఆ రోజున నామినేషన్లు వేసే అవకాశాలు చాలా తక్కువ.
  • 16వ తేదీ శుక్రవారం, తిథి అష్టమి ధనిష్ట నక్షత్రం కావడంతో నామినేషన్లు వేయడానికి అంతగా ఎవరు సాహసించకపోవచ్చు. 
  • 17వ తేదీ శనివారం, తిథి నవమి శతభిషా నక్షత్రం ఉండగా  మధ్యాహ్నం 2.26 గంటల వరకు నవమి ఉంటుంది. వెంటనే దశమి వస్తుండటంతో ఆ రోజు ఎక్కువగా నామినేషన్లు పడే అవకాశాలు ఉంటాయి.
  • 18వ తేదీ ఆదివారం
  • 19వ తేదీ సోమవారం నామినేషన్ల చివరి రోజు. ఆ రోజు తిథి ఏకాదశి, ఉత్తరాభాద్ర నక్షత్రం కావడంతో ఆరోజు మంచి రోజుగా భావించి ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశాలు ఉంటాయి.

మంచి ముహూర్తాలు ఉన్నాయి
కార్తీక మాసం ప్రారంభం కావడంతో మంచి శుభ ముహూర్తాలున్నాయి.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల కోసం ఈ వారం రోజులూ మంచి దివ్యమైన ముహుర్తాలే..  అభ్యర్థులు వారి వారి జాతక రీత్యా సుముహూర్త సమయంలో నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.
  – రవిశర్మ, బ్రాహ్మణ సేవా సమాఖ్య అడహక్‌ కమిటీ అధ్యక్షుడు, షాద్‌నగర్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు