ఇక వీధి పోరాటాలే

6 Sep, 2015 02:58 IST|Sakshi
ఇక వీధి పోరాటాలే

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ దూకుడు
    ♦ ఎమ్మెల్యే చిట్టెంపై దాడికి నిరసనగా ఆందోళన
    ♦ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు
    ♦ సీఎం క్యాంపు ఆఫీసు వద్ద మెరుపు ధర్నా
    ♦ ఉత్తమ్, జానా, భట్టి, షబ్బీర్ సహా నేతల అరెస్టు
    ♦ ఇది ప్రజాస్వామ్యంపైనే దాడి: టీ పీసీసీ
    ♦ రేపు జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. తమ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్... ఇకపై టీఆర్‌ఎస్‌ను గట్టిగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. వినతిపత్రాలంటూ కాలయాపన చేయకుండా వీధుల్లో పోరాటానికి దిగాలని భావిస్తోంది. అందులో భాగంగానే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై దాడికి నిరసనగా తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టింది. శనివారం నిర్వహించిన ఈ ఆందోళనలు, ధర్నా ఉద్రిక్తంగా మారాయి. ఇది ప్రజాస్వామ్యంపై దాడేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ...  కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు, పోలీసులకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. దీంతో నేతలు, కార్యకర్తలు అక్కడే మెరుపు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారిని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అంతకుముందు నేతలంతా గవర్నర్ నరసింహన్‌ను కలసి టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించిన మహబూబ్‌నగర్ జిల్లా బంద్ విజయవంతమైంది. టీఆర్‌ఎస్ దురాగతాలను నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రాల్లో నిరసనలకు టీ పీసీసీ పిలుపునిచ్చింది.
 

తొలుత రాజ్‌భవన్ నుంచి..
 శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో వాగ్వాదానికి దిగిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శనివారం ఆందోళనలు చేసింది. తొలుత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, జీవన్‌రెడ్డి, డీకే అరుణ, మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. కరువుపై, రైతుల సమస్యలపై మాట్లాడటానికి ప్రయత్నించిన తమ ఎమ్మెల్యేపై అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడికి దిగారని ఫిర్యాదు చేశారు. బాలరాజుపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం సీఎం కేసీఆర్‌ను కలసి, ఫిర్యాదు చేయడానికి క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. క్యాంపు కార్యాలయానికి సమీపంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్దకు వారు చేరుకోగానే.. అక్కడ భారీ సంఖ్యలో మోహరించి ఉన్న పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడే ధర్నా చేపట్టి... ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి పోలీసులు నేతలను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇంత దారుణమా?: ఉత్తమ్, షబ్బీర్‌అలీ
 ప్రతిపక్ష ఎమ్మెల్యేపై దాడి చేయడమే కాకుండా, సీఎంకు ఫిర్యాదు చేయడానికి వెళతామంటే అడ్డుకోవడం దారుణమని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ మండిపడ్డారు. శాంతియుతంగా వెళుతున్న సీనియర్ నేతలను అరెస్టు చేయడం ద్వారా సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలను, కరువును పట్టించుకోని అధికార పార్టీ.. దానిని ప్రశ్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగడం అత్యంత హీనమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
పాలమూరు బంద్ సక్సెస్
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తమ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన బంద్ విజయవంతం అయింది. కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా బాలరాజు దిష్టిబొమ్మలను దహనం చేశారు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. జిల్లాలోని 9 డిపోల్లోంచి బస్సులు బయటకు రాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నిర్వహించిన ఈ బంద్‌కు వనపర్తి నియోజకవర్గం పరిధిలోని ఖిల్లాఘనపూర్‌లో టీడీపీ మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొంది.

>
మరిన్ని వార్తలు