కరీంనగర్‌కు మణిహారం

6 Aug, 2018 12:00 IST|Sakshi
మానేరువాగులో కేబుల్‌ వంతెన పనులను పరిశీలిస్తున్న గంగుల కమలాకర్‌

కరీంనగర్‌: కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణంతో జిల్లా అత్యద్భుతమైన టూరిజం స్పాట్‌గా ఎదుగుతుందని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. నగరశివారులో నిర్మితమవుతున్న వంతెన ప్రాంతాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఇప్పటికే డిజైనింగ్‌ పూర్తయిందని, మరో ఏడాదిలో కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వివరాలను సంబంధిత కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కరీంనగరానికి తలమానికంగా కేబుల్‌బ్రిడ్జి, మానేరు రివర్‌ ఫ్రంట్‌ నిలుస్తాయని తెలిపారు. కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా సాగుతోందని అన్నారు. నగరశివారులోని బైపాస్‌రోడ్డు సమీపంలో ఈ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. వరంగల్‌ నుంచి కరీంనగర్‌ రహదారిలో సదాశివపల్లి నుంచి మానేరు మీదుగా కమాన్‌చౌరస్తా వరకు ఈ రోడ్డు నిర్మాణం కానుందని అన్నారు. ఆరులేన్ల రహదారి తోపాటు కేబుల్‌ బ్రిడ్జి సహితంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని వెల్లడించారు.

కేబుల్‌ బ్రిడ్జి డిజైనింగ్‌ పూర్తయిన నేపథ్యంలో బ్రిడ్జి టవర్ల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేబుల్‌ బ్రిడ్జి డిజైన్‌ను టర్కీ కంపెనీ ఆధ్వర్యంలో బ్యాంకాక్‌లో రూపొందించారని తెలిపారు. రూ.185 కోట్ల ఖర్చుతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలోనే మొదటిదని అన్నారు. ఈ బ్రిడ్జి పూర్తయితే కరీంనగర్‌ పర్యాటకంగా నంబర్‌వన్‌ పోజిషన్‌లో ఉంటుందన్నారు. వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వచ్చేవారికి ఈ రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. గతంలో కంటే కొద్దిగా డిజైనింగ్‌ మార్చామని, సదాశివపల్లి వద్ద బ్రిడ్జిపైకి ఎక్కేవారు నేరుగా హౌసింగ్‌ బోర్డు వద్దనే రోడ్డు దిగేలా అండర్‌పాస్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రెండు ప్రధాన ఫిల్లర్ల మధ్య 650 ఫీట్ల దూరం ఉంటుందని, మానేరు రివర్‌ఫ్రంట్‌ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎడ్ల అశోక్, పూసాల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు