రణరంగం

17 May, 2017 03:16 IST|Sakshi
రణరంగం

పోటాపోటీ నినాదాలతో రాళ్లు రువ్వుకున్న శ్రేణులు
పగిలిన తలలు, చిరిగిన చొక్కాలు.. కార్లు, బైక్‌లు ధ్వంసం
యుద్ధభూమిని తలపించిన ఎస్సెల్బీసీ ప్రాంగణం
కోమటిరెడ్డిని బలవంతంగా బయటకు పంపించిన పోలీసులు
వైఎస్‌ విగ్రహం వద్ద వెంకట్‌రెడ్డి ధర్నా.. ‘మిర్యాల’కు తరలింపు
బత్తాయి మార్కెట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు
హరీశ్‌ రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ సుఖేందర్‌రెడ్డి


సాక్షి, నల్లగొండ : సాయంత్రం 4 గంటలు.. నల్లగొండ నుంచి సాగర్‌ వెళ్లే రహదారిలో గంధంవారి గూడెం గ్రామ సమీపంలోని ఎస్సెల్బీసీ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. బత్తాయి మార్కెట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు వస్తుండడంతో టెంట్లు,మైకులతో ఆ ప్రాంతమంతా హడావుడిగా ఉంది. తెలంగాణ పాటలు, ఉపన్యాసాలతో అక్కడ ఉత్సాహకర వాతావరణం కనిపిస్తుండగానే ఉన్నట్టుండి గాల్లోకి రాళ్లు లేచాయి. ఏంటీ... రాళ్ల వాన ఏమైనా కురుస్తుందా అని ఆలోచించేలోపే ఆ వాన యుద్ధంగా మారింది. పెద్ద పెద్ద రాళ్లు, గుండ్లు గాలిలో రయ్యిమని వచ్చి తలలు పగులగొట్టాయి. అవే రాళ్లు కార్ల అద్దాలు, బైక్‌లను ధ్వంసం చేశాయి. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసినంత తేలికగా రాళ్లు విసురుకోవడంతో ఆ ప్రదేశం అరగంటకు పైగా యుద్ధభూమిగా మారింది. కర్రలు ఓ చేత్తో, రాళ్లు మరో చేత్తో పట్టుకుని ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. నల్లగొండలో మంగళవారం అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య రాజకీయ రణరంగమే జరిగింది.

అసలేం జరిగిందంటే..
జిల్లా రైతుల చిరకాల కోరిక అయిన బత్తాయి మార్కెట్‌ శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రానుండడంతో టీఆర్‌ఎస్‌ నేతలు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించారు. తొలుత మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో మర్రిగూడ బైపాస్‌ నుంచి కోమటిరెడ్డి బైక్‌ర్యాలీతో క్లాక్‌టవర్‌కు చేరుకున్నారు.

అప్పటికే అక్కడకు చేరుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడే కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన కోమటిరెడ్డి ర్యాలీగా బత్తాయి మార్కెట్‌ శంకుస్థాపన చేసే ప్రదేశం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కోమటిరెడ్డిని చూసి గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా తాను కూడా కార్యక్రమంలో పాల్గొంటానని కోమటిరెడ్డి తన అనుచరులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసిన టెంటు కింద కూర్చున్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రులు వచ్చే సమయం సమీపిస్తుండడం, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బైక్‌ర్యాలీతో పట్టణం నుంచి శంకుస్థాపన ప్రాంగణానికి వస్తుండడంతో పరిస్థితి చేయి దాటుతోందని గమనించిన పోలీసులు కోమటిరెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. వెంకట్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు కూడా వెళ్లిపోతున్న సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కొందరు అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించే ప్రయత్నం చేశారు. గమనించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారిపై దాడి చేసేందుకు పరుగులు తీశారు. దీంతో రాళ్లు గాల్లోకి లేచాయి. అటునుంచి రాళ్లు రావడంతో సభాప్రాంగణంలో ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న రాళ్లను కి విసిరారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ శ్రేణుల వైపు నుంచి కూడా రాళ్లు వచ్చాయి. దీంతో పదుల సంఖ్యలో తలలు పగిలాయి. ఇరు పార్టీల కార్యకర్తలు తమకు దొరికిన కార్లు, బైక్‌లను ధ్వంసం చేశారు. ఇలా అరగంటకు పైగా సాగర్‌ రోడ్డు యుద్ధక్షేత్రాన్ని తలపించింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఆ తర్వాత మాటల యుద్ధం
రాళ్ల యుద్ధం ముగిసి కోమటిరెడ్డి అరెస్ట్‌.. ఆ తర్వాత బత్తాయి మార్కెట్‌ శంకుస్థాపన.. అనంతరం కూడా ఇరుపార్టీల నేతలు మాటల యుద్ధం చేసుకున్నారు. తన అరెస్ట్‌ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిలాల్లో టీఆర్‌ఎస్‌ నేతలందరూ నయీం అనుచరులేనని, రౌడీల్లా మారి జిల్లాలో అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక, బత్తాయి మార్కెట్‌ బహిరంగసభలో మాట్లాడిన ఎంపీ సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్, జగదీశ్‌  కూడా కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డిని ఎంపీ సుఖేందర్‌రెడ్డి కల్లుతాగిన కోతితో పోల్చారు. ప్రతిపక్షాలు పాటించాల్సిన సంప్రదాయాలు ఎమ్మెల్యే కోమటిరెడ్డికి తెలియవని, చీప్‌ పాపులారిటీ కోసం ఆయన పాకులాడుతున్నాడని విమర్శించారు. హీరో అనిపించుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరించిన కోమటిరెడ్డికి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.

ఆగమాగం ఎందుకు చేసిండు.. : మంత్రి హరీశ్‌రావు
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మంచి జరగడం ఇష్టం లేకనే, మంచి పేరు తమకు వస్తుందనే దుగ్ధతోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఇలా వ్యవహరించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘మీ ఎమ్మెల్యేకు ఎందుకంత తొందరో అర్థమైతలేదు. మేమేమీ ఏసీలో కూర్చోలేదు కదా.. 15 ఏళ్ల నుంచి బత్తాయి మార్కెట్‌ అడుగుతున్నా కాంగ్రెసోళ్లు చేయలేదు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి మంత్రులుగా ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మేం చేస్తుంటే కుండీలు ఎత్తేసుడు.. ఫ్లెక్సీలు చించుడు.. ఎందుకింత ఆగమాగం చేసిండో అర్థం కావడం లేదు. రసాభాస చేస్తే పేరు రాకుండా పోతుందనే ఉద్దేశంతోనే.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మేం కరవలేదు.. బుస మాత్రమే కొట్టాం : మంత్రి జగదీశ్‌
బత్తాయి మార్కెట్‌ శంకుస్థాపన సందర్భంగా జరిగిన గొడవపై మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డిని కోతి అనడానికి కూ డా లేదని, అంతకన్నా దరిద్రం గా ఆయన తయారయ్యాడని అ న్నారు. మీడియాలో కనిపిం చాల నే ఆలోచనతో చిల్లర వేషాలు వేస్తున్నాడని అన్నారు. అరాచకా లు, చిల్లర వ్యవహారాలను జిల్లాలో సాగనీయబోమని, అలా చే యాలని చూస్తే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించా రు. ‘ఇవి ఇంక మీ జాగీర్లు కావు. తెలంగాణ ప్రజల అడ్డాలు. మేం పూర్తిగా కరవలేదు. కేవలం బుస మాత్రమే కొట్టాం.’ అని వ్యాఖ్యానించారు.

మళ్లీ ధర్నా
తనను శంకుస్థాపన ప్రదేశం నుంచి బలవంతంగా పోలీసులు పంపించివేయడాన్ని, తమ కార్యకర్తలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి దేవరకొండ రోడ్డులోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నేతలు రౌడీల్లా ప్రవరిస్తున్నారని, వారి అరాచకాలకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని ఆయన హెచ్చరించారు. ఇంతలో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అక్కడకు చేరుకుని కోమటిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. అక్కడి నుంచి పోలీసులు ఆయనను మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే, కోమటిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయం వద్ద కూడా ధర్నా నిర్వహించాయి. కోమటిరెడ్డిని అరెస్టు చేస్తున్న సందర్భంగా నల్లగొండలో కాంగ్రెస్‌ శ్రేణులు ప్రతిఘటించడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కోమటిరెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి మార్కెట్‌ వద్దకు చేరుకుని శంకుస్థాపన చేశారు.

మరిన్ని వార్తలు