ఆ గురుకులాలను తక్షణమే ప్రారంభించాలి 

9 Jul, 2018 01:06 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు 119 బీసీ గురుకుల పాఠశాలలను తక్షణమే ప్రారంభించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం బీసీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేబినెట్‌ బీసీ సబ్‌కమిటీ సమావేశంలో భాగంగా 119 గురుకులాలను ప్రారంభిస్తామని గతేడాది డిసెంబర్‌లోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించారని గుర్తుచేశారు.

ఇప్పుడు వచ్చే విద్యాసంవత్సరం వాటిని ప్రారంభిస్తామని చెప్పడం సరికాదన్నారు. జనాభా సంఖ్యకు తగినన్ని గురుకులాలు లేకపోవడంతో వేలాది బీసీ విద్యార్థులు అడ్మిషన్ల కోసం కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లే సీఎం ఇస్తామనడం అన్యాయమన్నారు. దరఖాస్తుల సంఖ్యను పట్టించుకోకుండా అరకొర నిధులిస్తే ఎలాగని ప్రశ్నించారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని.. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించాలని కృష్ణయ్య కోరారు. 

మరిన్ని వార్తలు